దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని... నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది.
కుమారుడి సంస్థ నుంచే ఆధారాలు..
వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్సాయికృష్ణకు చెందిన సంస్థ ద్వారా అత్యంత కీలకమైన నిఘా పరికరాలను, వ్యవస్థలను కొనుగోలు చేశారని మరో నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. ఆయన కుమారుడి సంస్థ నుంచే పోలీసులు వినియోగించే కీలకమైన నిఘా పరికరాలను కొనుగోలు చేయించటం అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులు వినియోగించే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ ఉపకరణాలను ప్రైవేటు వ్యక్తులు, విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ చేతుల్లో పెట్టటం ద్వారా... జాతీయ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించారని ప్రభుత్వం తన నివేదికలో వివరించింది.
దేశ ద్రోహానికి పాల్పడ్డారా..?
వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేపట్టిన విచారణలో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ వద్ద కొనుగోలు చేసిన నాసిరకం పరికరాలు. రాష్ట్ర భద్రత వ్యవహారాలను, పోలీసులను ప్రమాదకరమైన స్థితిలో పడేశాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర రహస్యాలను ఇతరులు తెలుసుకునేలా ఉన్నాయని స్పష్టం చేసింది. పోలీసులు భవిష్యత్తులో కొనుగోలు చేయనున్న వ్యవస్థలకు సంబంధించిన అంశాలు బహిర్గతం అయ్యేలా వెంకటేశ్వరరావు వ్యవహరించారని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా లాభపడేందుకు వెంకటేశ్వరరావు తన కుమారుడితో ఓ నకిలీ కంపెనీని ఏర్పాటు చేయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా..
నిఘా, భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తదితర సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా... అవేమీ పాటించలేదని స్పష్టం చేసింది. ఉపకరణాలు కొనుగోలు చేసిన ఆదేశాల పత్రాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని పేర్కొంది. దీనిపై అదనపు డీజీ-ఆపరేషన్స్, సీఐడీ అదనపు డీజీ అడిగిన వివరణలను వెంకటేశ్వరరావు పట్టించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిబంధనల్ని అతిక్రమించినందుకు..
అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించినందుకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 7న డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి వచ్చిన లేఖను అనుసరించి వెంకటేశ్వరరావుపై తక్షణం సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు తెలిపారు. తదుపరి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ... "మనకృష్ణ"తో ప్లాస్టిక్ రహితంగా విజయవాడ..!