బిర్యానీ అంటే ఇష్టం. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే పడి చచ్చిపోతాడు. అంతేనా చిరుతిళ్లకూ అలవాటు పడ్డాడు. కానీ రోజూ ఇవన్నీ తినేందుకు అతని దగ్గర డబ్బులు లేవు. లేబర్ పనులు చేసుకుంటూ వచ్చే డబ్బు తన తిండికి సరిపోక... దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా డబ్బు కాజేసేవాడు. ఎంచక్కా హోటల్‌కెళ్లి కడుపునిండా బిర్యానీ తిని.. కమ్మని చిరుతిళ్లతో ఇంటికి చేరేవాడు. నచ్చినపుడు వాటిని తింటూ.. దొంగతనాలు ఎలా చేయాలో ఆలోచించేవాడు. తినడం కోసమే దొంగతనాలు చేస్తున్నాడు.. అతనికి భారీ శరీరం ఉండి, పెద్దోడు అని ఊహించుకునేరు. అతడింకా మైనరే. వయసు కేవలం పదమూడేళ్లే.
ఒక్క పీఎస్‌లోనే 10 కేసులు నమోదు
ఆ బాలుడి వయస్సు 13 ఏళ్లు.. కానీ అతనిపై ఒక్క ఠాణా పరిధిలోనే 10 చోరీ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అంజనాద్రినగర్‌లో చోరీకి పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారించగా ఆర్నెల్ల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ఠాణా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడంతో ఇప్పటికే పది కేసులు నమోదైనట్లు తేలింది. హయత్‌నగర్ సీఐ సురేందర్ గౌడ్ కథనం మేరకు... బిహార్‌కు చెందిన బాలుడు లేబర్ పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్ మండల మునగనూరు అంజనాద్రి నగర్‌లో ఉంటున్నాడు. స్థానికంగా శనివారం ఓ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇనుపరాడ్డుతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.
బంగారం, వెండి, చరవాణి స్వాధీనం..
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4 వేలు, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. బిర్యానీ, చిరుతిళ్లకు అలవాటుపడి సునాయాసంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. గతంలోనూ అతన్ని అదుపులోకి తీసుకుని బాలనేరస్థుల హోమ్‌కు తరలించగా విడుదలైన తర్వాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ వెల్లడించారు.
ఇదీ చదవండి: చింతపల్లిలో అల్లూరి స్మారక పోస్టల్ కవర్ ఆవిష్కరణ