రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వైరస్ సోకి 82 మంది మృతి చెందినట్టు చెప్పారు.
వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కేసులు
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398 కొత్త కేసులు రాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 793 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లాలో 12మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం జిల్లాలో 9మంది, తూర్పుగోదావరి 9, విశాఖ 9, విజయనగరం 9, నెల్లూరు 7, కృష్ణా 6, గుంటూరు 5, చిత్తూరు 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజాగా 12,207మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం