Youngest Richest in India: ఇంకా వయసు 20 దాటలేదు.. చదువు పూర్తి కాలేదు.. అలాంటి వారు.. అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. 19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లిద్దరూ దూసుకుపోయారు. ఏడాదిలో ఏకంగా రూ.7వేల కోట్లకుపైగా విలువైన కంపెనీని సృష్టించి సంచలనం రేపారు. వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్‌లో బిలియనీర్ల క్లబ్‌లో చేరిన అత్యంత పిన్న వయస్కులయ్యారు! వారే.. కైవల్య వోహ్రా, అదిత్ పలీచా! పెట్టిన కంపెనీ.. జెప్టో!
జెప్టో అంటే సమయాన్ని కొలిచే అత్యంత చిన్న కొలమానం. చిటికె వేసే కాలం అనుకోవచ్చు. అంటే కచ్చితంగా అంతేగాకున్నా.. అతి తక్కువ సమయంలో ఇంటికి కిరాణా, ఇతరత్రా సామగ్రిని అందించే ఈ కంపెనీకి ఇంతకంటే సరైన పేరు ఉండదేమో!
స్టాన్‌ఫర్డ్ చదువు వదిలేసి..
విదేశీ విద్యకు ఉవ్విళ్లూరుతున్న ఈతరంలో.. ఎవరైనా స్టాన్‌ఫర్డ్‌లో చదువును మధ్యలోనే వదులుకుంటారా? అంతా నడిచే దారిలో నడవరు కాబట్టే.. కైవల్య, అదిత్‌లు స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును వదిలేసుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్ కాలేజీలో చదివాడు. గణితం, కంప్యూటర్ సైన్స్‌తో పాటు హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో నైపుణ్యముంది. అదిత్ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్‌లో చదివాడు. స్టాన్‌ఫర్డ్‌కు వెళ్లటానికి ముందే.. 17 ఏళ్ల వయసులోనే గోపూల్ పేరుతో.. విద్యార్థులకు కార్ల పూలింగ్ స్టార్టప్ ఆరంభించాడు. ప్రైవసీ పాలసీలకు సంబంధించిన కృత్రిమ మేధ ప్రాజెక్టు ప్రైవసీ కూడా అదిత్ సొంతం. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదవటానికి విశ్వవిఖ్యాత స్టాన్‌ఫర్డ్ కాలేజీకి వెళ్లారు. కానీ కరోనా లాక్‌డౌన్ వేళ తట్టిన ఐడియా.. వారి జీవితాన్నే మలుపు తిప్పింది. స్టాన్‌ఫర్డ్ చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టి డ్రాపౌట్లుగా మారారు.
కరోనా కష్టం రాత మార్చింది..
2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో ముంబయిలో కిరాయి అపార్ట్‌మెంట్లో ఉన్న వీరిద్దరూ.. చాలామంది సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకులకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందే వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది. తొలుత కైవల్య.. కిరాణామార్ట్ పేరుతో ఈ స్టార్టప్ ఆరంభించాడు. తర్వాత అదిత్ చేరాడు. స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని.. తక్షణమే ఇళ్లకు సామగ్రిని చేర వేయటం మొదలెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సరిదిద్దుకుంటూ వెళ్లారు.
విలువ రూ.7వేల కోట్లకుపైగా..
2021 ఏప్రిల్‌లో ముంబయిలో రూ.485.3 కోట్ల ఆరంభ ఫండింగ్‌ను ఆకర్షించి కార్యకలాపాలు ఆరంభించిన కంపెనీ ఇప్పుడు పదికిపైగా పట్టణాల్లో సుమారు 1500 మంది సిబ్బందితో విస్తరించి సేవలందిస్తోంది. ఈ కుర్రాళ్లిద్దరి చొరవ, ఆలోచన శక్తి, ప్రజల అవసరాలు తీరుస్తున్న వైనాన్ని చూసి.. జెప్టో స్టార్టప్‌లో నెల తిరిగే సరికి మరో రూ.800 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది మేలో రూ.1617 కోట్లు వచ్చాయి. తద్వారా.. కంపెనీ విలువ రూ.7వేల కోట్లకుపైగా చేరింది. కిరాణా సామగ్రితో పాటు కాఫీ, టీ, చిరుతిళ్లులాంటివి కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
'2021 మార్చినాటికి పది నిమిషాల్లో వస్తువులు ఇంటికి చేర్చటం ఆశ్చర్యం కల్గించే ఆలోచన. పైగా.. మమ్మల్ని చూసి అంతా అనుమానించారు. మాపై, మా ఆలోచనలపై నమ్మకం కల్గించటం మొదట్లో సవాలుగా మారింది. 'చాలా స్టార్టప్‌లకు నిలదొక్కుకోవటానికి మూడు నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మేం మాత్రం ఆరునెలల్లో బలంగా నిలబడ్డాం. సమర్థులైన 9 మందిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోసిస్‌ల నుంచి నాయకత్వ స్థానాల్లో తీసుకున్నాం. మిగిలిన జట్టును నిర్మించాం. ఇప్పుడు మా ఆఫీసులో ఎవరూ మా వయసును గుర్తించరు. మీడియా మాత్రమే మేం ఇంకా 20 దాటలేదని గుర్తు చేస్తుంటుంది' అన్నారు అదిత్, కైవల్య! తాజాగా.. 2022 ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో ఈ ఇద్దరు కుర్రాళ్లు చేరారు. కైవల్య సంపద రూ.వెయ్యి కోట్లు; అదిత్ సంపద రూ.1200 కోట్లుగా తేలింది.
ఇవీ చదవండి: అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా!
కొడితే 'వజ్రాల బుట్ట'లో పడడమంటే ఇదేనేమో!.. రాత్రికి రాత్రే లక్షాధికారులుగా..