ఎవరైనా అప్పు తీసుకుంటే.. నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లింపులో విఫలమైతే చట్టానికి లోబడి ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు బ్యాంకరు తగిన చర్యలు తీసుకుంటారు. మరి రుణగ్రహీత రుణాన్ని చెల్లించాల్సిన వ్యవధిలోగా మరణిస్తే..ఆ అప్పును తీర్చాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది? ఇది తీసుకున్న రుణం, ఇచ్చిన హామీపై ఆధారపడి ఉంటుంది. వివిధ సందర్భాల్లో ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
గృహ రుణం..
ఒకవేళ ప్రాథమిక రుణగ్రహీతకు జరగరానిది జరిగినప్పుడు.. బ్యాంకు సహ-రుణగ్రహీతను సంప్రదిస్తుంది. ఒకవేళ సహ-రుణగ్రహీత చెల్లించలేకపోతే.. ఆ రుణ హామీదారు లేదా చట్టబద్ధ వారసులను బ్యాంకు సంప్రదిస్తుంది. ఈ గృహరుణం తీసుకున్న వ్యక్తి లోన్ కవర్ టర్మ్ పాలసీని తీసుకున్నారనుకుందాం.. అప్పుడు బీమా సంస్థ ఇచ్చిన పరిహారంతో రుణం తీరిపోతుంది. ఒకవేళ సొంతంగా టర్మ్ పాలసీ తీసుకుంటే.. పరిహారం నామినీ ఖాతాలో జమ అవుతుంది. దానిని వారసులకు చట్టప్రకారం బదిలీ చేస్తారు. గృహరుణం, ఇతరత్రా అప్పులు ఏవి ఉన్నా.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తంతో వాటిని చెల్లించేందుకు వారసులకే హక్కు ఉంటుంది. ఒకవేళ గృహరుణ బీమా లేకుంటే.. సహ-రుణగ్రహీత, వారసులు, హామీదారు నుంచి ఆ మొత్తాన్ని బ్యాంకు రికవరీ చేయలేదు. కేవలం ఆస్తిని జప్తు చేసి, వేలంలో విక్రయించి, ఆ మొత్తాన్ని అప్పు తీర్చేందుకు వినియోగించుకోవాలి. అధికంగా వచ్చిన మొత్తాన్ని వారసులకు అందిస్తుంది.
వాహన రుణం..
కారు రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబానికి దూరమైన సందర్భంలో.. బ్యాంకు రుణగ్రహీత కుటుంబాన్ని సంప్రదిస్తుంది. చట్టబద్ధ వారసులు ఉండి, వారు ఆ కారును తమతోనే అట్టిపెట్టుకోవాలని భావిస్తే.. వారు రుణ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారు నిరాకరిస్తే.. బ్యాంకు కారును జప్తు చేసుకొని, తన రుణాన్ని రికవరీ చేసుకుంటుంది.
వ్యక్తిగత రుణం.. క్రెడిట్ కార్డులు..
వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుకు ఎలాంటి హామీ ఉండదు. ఇలాంటి రుణాలను తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. వారసుల నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి ఈ అప్పును రికవరీ చేసుకునేందుకు వీల్లేదు. ఒకవేళ ఆ రుణానికి సహ-దరఖాస్తుదారు ఉన్న పక్షంలో బ్యాంకు తమ డబ్బులను వసూలు చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. సహ-రుణగ్రహీత లేనప్పుడు.. ఆ అప్పును ఏ విధంగానూ వసూలు చేసుకోలేదు. దీన్ని నిరర్థక ఆస్తిగా గుర్తించడం తప్ప ఏమీ చేయడానికి ఉండదు.
వారసులు ఏం చేయాలి?
బ్యాంకు చట్టబద్ధ వారుసులను సంప్రదించి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ నోటీసు ఇచ్చిందనుకుందాం. ఇటువంటి సందర్భాల్లో వారసులు ముందుగా.. ఆర్థిక మదింపు చేయాలి. మొత్తం ఆస్తుల విలువ, చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని లెక్కించుకోవాలి. బకాయిల కంటే ఆస్తి విలువ ఎక్కువగా ఉంటే.. రుణాలను చెల్లించడమే మేలు. తక్కువగా ఉంటే.. ఆస్తిని బ్యాంకరుకు అప్పజెప్పి.. రికవరీ చేసుకోవాల్సిందిగా చెప్పొచ్చు.
హామీ లేని రుణాల విషయంలో అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. చాలా సందర్భాల్లో హామీ లేని రుణాల విషయంలో సహ-రుణస్వీకర్తను జత చేస్తే వడ్డీ రేటును తగ్గిస్తారు. ఎందుకంటే ఇది బ్యాంకు రిస్క్‌ను చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి. రుణానికి తగిన బీమా కవరేజీని తీసుకోవడం రుణగ్రహీతకు ఎప్పుడూ మంచిది. అనుకోని సందర్భంలో కుటుంబ సభ్యులపై అప్పుల భారం పడకుండా ఇది కాపాడుతుంది. వారసులు ఆ ఆస్తిని అనుభవించగలుగుతారు.
- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్