ముడి చమురు ధరలు పెరుగుతున్నందున, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక కీలక రేట్ల పెంపును కొనసాగిస్తే, సమీప భవిష్యత్‌లోనూ డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మరింత క్షీణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, విదేశాల నుంచి దిగుమతుల కోసం డాలర్లు అధికంగా వెచ్చించాల్సి రావడం, వాణిజ్య లోటు పెరగడమూ ఇందుకు దోహదం చేస్తుందని అన్నారు.
- చమురు ధరలు పెరగడం కొనసాగి, ఫెడ్ కనుక వడ్డీరేటును మరో 75 బేసిస్ పాయింట్లు పెంచితే రూపాయి మారకపు విలువ 85ను పరీక్షించవచ్చని పీడబ్ల్యూసీ ఇండియాలో ఎకనమిక్ అడ్వయిజరీ సర్వీసెస్ పార్ట్‌నర్‌గా ఉన్న రనేన్ బెనర్జీ అంచనా వేస్తున్నారు.
- సమీపకాలంలో రూపాయికి ప్రతికూల ధోరణి కొనసాగి, డాలరు రూ.83.50 దిశగా సాగొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పరిశోధన విశ్లేషకులు దిలీప్ పర్మార్ చెబుతున్నారు.
- డాలరు మారకపు విలువ రూ.81.80- 82.50 శ్రేణిలో చలించొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్, బులియన్ విశ్లేషకుడు గౌరంగ్ సొమాయియా అంటున్నారు.
ఏడాది వ్యవధిలో 112 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు
సెప్టెంబరు 30తో ముగిసిన వారానికి, విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 4.854 బిలియన్ డాలర్లు తగ్గి, 532.664 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2020 జులై తర్వాత ఇదే కనిష్ఠస్థాయి. రూపాయి మారకపు విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ కొంతమేర విక్రయించడంతో, అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 8.134 బి.డాలర్లు క్షీణించి 537.518 బి.డాలర్లకు చేరాయి. 2021 అక్టోబరులో ఇవి జీవనకాల గరిష్ఠమైన 645 బి.డాలర్లుగా ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో 112 బి.డాలర్లకుపైగా తగ్గిపోయాయి.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ కీలక ప్రకటన.. త్వరలోనే మార్కెట్లోకి ఇ-రూపీ
భారత్ వృద్ధి 6.5 శాతమే.. అంచనాలను తగ్గించిన వరల్డ్ బ్యాంక్