Sovereign Gold Bonds 2023-24 Series III : సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ మూడో విడత సబ్‌స్క్రిప్షన్‌ను డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 22 వరకు ఈ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
గ్రాము ధర ఎంతంటే?
Sovereign Gold Bond Issue : ఆర్బీఐ ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.6199గా నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న మూడో సిరీస్ ఇది. ఈ ఏడాది జూన్‌లో మొదటి విడత, సెప్టెంబర్‌లో రెండో విడత పసిడి బాండ్లను విడుదల చేశారు.
డిస్కౌంట్ వారికి మాత్రమే!
Sovereign Gold Bond Discount Price : ఆన్‌లైన్‌లో పసిడి బాండ్లు కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఒక గ్రాము బంగారం రూ.6,149కే లభిస్తుంది.
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారంటే?
దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ పసిడి బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ పసిడి బాండ్ల ధరను ఎలా నిర్ణయిస్తారంటే.. సబ్‌స్క్రిప్షన్ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 ప్యూరిటీ కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ఒక సగటు ధరను నిర్ణయిస్తుంది. ఇలా నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము బంగారం రేటును నిర్ణయిస్తారు. సబ్స్క్రైబర్లు కనీసం 1 గ్రామును ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎంత బంగారం కొనవచ్చు?
Sovereign Gold Bond Subscription Limit : ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు అయితే 20 కేజీల వరకు గోల్డ్ కొనవచ్చు. ఈ గోల్డ్ బాండ్ పీరియడ్ 8 ఏళ్లు. గడువు ముగిసిన తరువాత, అప్పటికి ఉన్న ధరను చెల్లిస్తారు. సబ్స్క్రైబర్లు కావాలంటే, ఐదేళ్ల తర్వాత ఈ పథకం నుంచి వైదొలగవచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే గోల్డ్ బాండ్స్‌కు కూడా వర్తిస్తాయి.
ఎక్కడ అప్లై చేయాలి?
How To Subscribe Sovereign Gold Bond : షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీస్‌లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE, BSE)ల్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
సావరిన్ గోల్డ్ బాండ్లను భారతీయ పౌరులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. వీటిని మైనర్ పిల్లల తరఫున కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి స్వయంగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి జాయింట్‌గా కూడా పసిడి బాండ్లను కొనవచ్చు.
వడ్డీ ఎంత వస్తుంది?
Sovereign Gold Bond Interest Rate : పసిడి బాండ్లపై ఇష్యూ తేదీ నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. గోల్డ్ బాండ్ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.
పన్ను ప్రయోజనాలు
Sovereign Gold Bond Tax Benefits : సావరిన్ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఐదేళ్లు గడిచాక బాండ్లను విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 3 సంవత్సరాల తర్వాత బదిలీ చేస్తే, వ్యక్తికి దీర్ఘకాలిక మూలధన లాభాల కింద ఇండెక్సేషన్ అనంతరం 20 శాతం పన్ను వర్తిస్తుంది.
పసిడి బాండ్లు లాభదాయకమేనా?
భౌతిక బంగారంతో పోల్చి చూస్తే, సావరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు, సాధారణంగా మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ లాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గోల్డ్‌బాండ్ల విషయంలో ఇవి ఉండవు. చోరీ భయం అనేది అసలే ఉండదు. అందుకే సురక్షిత పెట్టుబడులు పెట్టాలని ఆశించేవారు గోల్డ్ బాండ్స్ కొనడం బెటర్ ఆప్షన్ అవుతుంది.
తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి - ఎందుకంటే?
మీడియా బిజినెస్‌లోనూ అదానీ దూకుడు - న్యూస్ ఏజెన్సీ IANSలో 50.5% వాటా కొనుగోలు