ఒకప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవాలంటే ఎన్నో సమస్యలు.. బ్యాంకుకు దరఖాస్తు చేయాలి.. అవసరమైన పత్రాలన్నీ సమర్పించాలి.. కొన్ని రోజుల తర్వాతే రుణం వస్తుందా లేదా అనేది తెలిసేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దరఖాస్తుకు ముందే ఎంత రుణం వస్తుందో తెలిసిపోతుంది. అలా అనుకోగానే ఇలా అప్పు తీసుకునే వీలూ వచ్చేసింది. కొత్తతరం ఫిన్‌టెక్ సంస్థలు పెరిగిపోతున్నాయి. అప్పులు ఇవ్వడంలోనూ ఇవి పోటీ పడుతున్నాయి. వీటి నుంచి రుణం తీసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకోవడాన్నే ఇప్పుడు డిజిటల్ లెండింగ్ అంటున్నారు. ఫిన్‌టెక్ అంకురాలు ప్రధానంగా వీటిని అందిస్తున్నాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రుణగ్రహీతల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నాయి. ఇస్తున్నారు కదా అని తొందరపడి అప్పు తీసుకుంటే తర్వాత కొన్ని ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆర్థిక నిపుణులు.
వ్యక్తిగత రుణం నిజంగా ఎంత మేరకు అవసరం అన్న అంచనా ముందుగా ఉండాలి. తర్వాత రుణం ఏ మేరకు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అప్పు ఇచ్చేటప్పుడు అందులో ఇమిడి ఉండే ఖర్చులను తెలుసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు, వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తే రుసుములు ఎలా ఉన్నాయో చూడాలి. ఈ ఖర్చులు పెరిగితే.. మీకు వచ్చే రుణ మొత్తం తగ్గిపోతుంది. రుణం తీసుకునేటప్పుడు గమనించాల్సిన ప్రధాన విషయం ఇంకోటుంది.. మీ మొత్తం ఆదాయంలో 40 శాతానికి మించి వాయిదాలు ఉండకూడదు. చెల్లింపులు పెరిగితే.. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు అడ్డంకిగా మారుతుంది.
వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చూసుకోవాలి. మీ రుణ చెల్లింపుల ఆధారంగా క్రెడిట్ స్కోరు ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరంటే.. 750ని మించి ఉండాలి. తక్కువ క్రెడిట్ స్కోరున్న వారికి రుణాలు లభించడం అంత తేలికేమీ కాదు. కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి రుణ సంస్థలు. వాయిదాలను సకాలంలో చెల్లించడం, తక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడే స్కోరు పెరిగేందుకు వీలుంటుంది.
రుణదాత ఎంపిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు చేసిన మోసాల గురించి వింటూనే ఉన్నాం. మన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా సంస్థలకు అందించినప్పుడు, తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే, మన ధ్రువీకరణలతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి, ముందే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఆర్‌బీఐ అనుమతి పొందిన సంస్థల నుంచే రుణాలు తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.