కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నవ భారత అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. ఈ బడ్జెట్.. సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. పన్నుల ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్.. రైతులు, మధ్యతరగతి ప్రజల కలలను నెరవేరుస్తుంది. మౌలిక వసతుల కల్పనలో మునుపెన్నడూ లేని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధికి వేగం, కొత్త శక్తి లభిస్తుంది. సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారత్ కలలను నెరవేర్చడానికి మధ్యతరగతి ప్రజలు ఒక పెద్ద శక్తి. అందుకే వారిని సాధికారుల్ని చేయడానికి మా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.
--నరేంద్ర మోదీ, ప్రధాని
ఎన్నికల బడ్జెట్..
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 3-4 రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం.. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. పేద ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఏం ఉపయోగం లేదని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి ఎటువంటి హామీ లేదని దుయ్యబట్టారు.
చీకటి బడ్జెట్..
కేంద్ర బడ్జెట్.. ప్రజలు, పేదలకు వ్యతిరేకంగా ఉందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదాయపు పన్ను శ్లాబులలో మార్పులు ఎవరీకి ఉపయోగపడవని విమర్శించారు. 'ఈ బడ్జెట్ దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో సహాయపడదు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందిన బడ్జెట్. ఇదొక చీకటి బడ్జెట్. నాకు అరగంట సమయం ఇవ్వండి.. పేదల కోసం బడ్జెట్‌ను ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను' అని మమతా బెనర్జీ అన్నారు.
సవతి తల్లిలా చూస్తున్నారు..
కేంద్ర బడ్జెట్లో దిల్లీకి మొండి చెయ్యి ఎదురైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గతేడాది రూ.1.75 లక్షల కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినప్పటికీ దిల్లీకి రూ.325 కోట్ల నిధుల మాత్రమే బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన తెలిపారు. దేశ రాజధానిని కేంద్రం సవతి తల్లిలా చూస్తోందని విమర్శించారు. ఈ బడ్జెట్‌లో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనానానికి నిధుల కేటాయింపులు లేవని అన్నారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారవేత్తలు స్పందించారు. 'దార్శనికత, నిర్మాణం, క్రమశిక్షణతో కూడిన బడ్జెట్. అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ అద్భుతంగా ఉంది.' అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్ అన్నారు.
భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపే బడ్జెట్. దేశీయ తయారీకి భారీగా ప్రోత్సాహాకాలు అందించింది కేంద్ర బడ్జెట్. ఉద్యోగాల కల్పన, వ్యాపార సులభతరణకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది.
--హర్ష గోయెంకా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్