అమెరికాకు చెందిన ఇలై లిల్లీ అండ్ కంపెనీ డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతుంటుంది. ఈ సంస్థ పేరు మీద కొందరు ట్విట్టర్లో నకిలీ ఖాతా తెరిచారు. 8 డాలర్లతో ఆ అకౌంట్‌కు బ్లూ టిక్ సంపాదించారు. ఆ తర్వాత ఓ తప్పుడు వార్తను అందులో పోస్ట్ చేశారు. ఇకపై అందరికీ తమ కంపెనీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రభావానికి అసలు సంస్థ షేర్ల ధర 4.37 శాతం పడిపోయింది. దాదాపు రూ.1.22 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ ఘటనపై ఇలై లిల్లీ అండ్ కంపెనీ స్పందించింది. ఈ ట్వీట్ ఓ నకిలీ ఖాతా నుంచి వచ్చిందని.. ఇది ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేసిందని క్షమాపణలు కోరింది.
ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు ట్విట్టర్లో కేవలం రాజకీయ నేతలు, వార్తా సంస్థలు, నటీనటులు వంటి వారికి మాత్రమే బ్లూ టిక్ సదుపాయం ఉండేది. వారి ఖాతాలను పరిశీలించిన తరువాతనే ట్విట్టర్ బ్లూ టిక్ ఇచ్చేది. కానీ మస్క్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ బ్లూ టిక్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఇవీ చదవండి: ఇంటి లోన్ కోసం క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే!