కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్-ONDC ప్రైవేటు ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీకి సవాల్ విసురుతోంది. ONDCలో తక్కువ ధరకే ఆహారం లభిస్తోందని పలువురు వినియోగదారులు స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ONDC ట్రెండ్ అవుతోంది. ఆహార విభాగంలో రోజువారీ డెలివరీలు 10వేలకు చేరుకున్నాయి.
ఈ-కామర్స్ విభాగంలో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ ONDCని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ యాప్స్‌తో సంబంధం లేకుండా ఈ వేదిక ద్వారా వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాలు, కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ సహా 240కి పైగా నగరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగానే ఆహార విభాగంలోకి ప్రవేశించింది. సోషల్‌మీడియా కారణంగా గత కొన్ని రోజులుగా విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంటోంది. సాధారణంగా రెస్టారెంట్లకు, హోటళ్లకు నేరుగా వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఆహార పదార్థాల ధరలకు, ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఉండే ధరలకు వ్యత్యాసం ఉంటుంది. దీనికి డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు యూజర్లు స్విగ్గీ, జొమాటోలో లభించే ఆహారానికి, ఓఎన్‌డీసీ వేదికగా లభించే ఆహార పదార్థాల ధరలతో పోలుస్తూ స్క్రీన్‌షాట్లు పోస్ట్ చేస్తున్నారు.అయితే స్విగ్గీ, జొమాటో మాదిరిగా యాప్ రూపంలో కాకుండా పేటీఎం, స్పైస్ వంటి యాప్‌ల్లో అంతర్గతంగా అందూబాటులో ఉంచారు.
స్విగ్గీ, జొమాటో తరహాలో ఓఎన్‌డీసీకి ప్రత్యేకంగా యాప్ అంటూ ఏదీ లేదు. మనకు ఏదైనా కావాలంటే బయ్యర్ యాప్స్‌లోకి వెళ్లి కొనుగోలు చేయాలి. పేటీఎం, మైస్టోర్, పిన్‌కోడ్, స్పైస్ మనీ వంటి యాప్స్ ప్రస్తుతం బయ్యర్ యాప్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు పేటీఎంను తీసుకుంటే.. పేటీఎం యాప్‌లోకి వెళ్లి ONDC అని సెర్చ్ చేసి.. ఆహార విభాగంలో మీకు నచ్చిన ఆహరాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే, ఓఎన్‌డీసీ కొత్తది కావడం వల్ల అన్ని రెస్టారెంట్లు, అన్ని పిన్‌కోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో ఈ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు..
హైదరాబాద్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది ఘుమఘుమ లాడే హైదరాబాదీ బిర్యానీ. ఈ బిర్యానీ ఇష్టపడని భోజన ప్రియులు ఉండరు. బిర్యానీ అంటే ఇష్టంలేని వారు ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారంటే.. ఆహా అనకుండా ఉండలేరు. సాధారణ రోజుల్లోనే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక రంజాన్ పవిత్ర మాసంలో దీని హవాయే వేరు. కానీ కొన్నేళ్లుగా రంజాన్ మాసంలో హలీమ్ వచ్చేసి.. బిర్యానీని డామినేట్ చేసేసింది. ఇక అప్పటినుంచి రంజాన్ నెలలో బిర్యానీ క్రేజ్ తగ్గి హలీమ్‌కు క్రేజ్ పెరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం బిర్యానీ సేల్స్ హలీమ్‌ను దాటేశాయి. ఏకంగా రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఈ విషయాన్ని స్విగ్గీ ప్రకటించింది. గతేడాది కంటే ఇది 20శాతం అధికం అని తాజాగా వెల్లడించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.