2023-24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు మేలని.. వారి వద్ద నగదు లభ్యత పెరుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని వారిని ప్రేరేపించాల్సిన అవసరం లేదని.. పెట్టుబడులకు సంబంధించి వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. బడ్జెట్ వివరాలను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డుకు వివరించిన నిర్మలా సీతారామన్.. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు.
నియంత్రణ సంస్థల్లో చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారని.. తమ రంగంలో వారు నిపుణులని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎప్పటిలాగే వారు తమ పని చేస్తున్నారని చెప్పారు. అదానీ వ్యవహారంపై రెగ్యులేటర్లు దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. నియంత్రణా సంస్థలు ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటాయన్నారు. క్రిప్టో కరెన్సీపై ఉమ్మడి కార్యాచరణ దిశగా జీ-20 దేశాలతో చర్చలు జరుపుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
మరోవైపు ధరల పెరుగుదల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానం ఇచ్చారు. ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే 2023-24లో ద్రవ్యోల్బణం 5.3 శాతానికి చేరనుందని ఆయన అంచనా వేశారు. రుణాలు ప్రియం కావడంపైనా ఆయన స్పందించారు. రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనేవి పోటీ మార్కెట్ నిర్ణయిస్తుందని శక్తికాంత దాస్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ చమురు 95 డాలర్లు ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్ను విధానంలో మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండబోదని ప్రకటించింది. రూ.3 నుంచి 6 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.6 నుంచి 9 లక్షలపై 10 శాతం, రూ.9-12 లక్షలపై 15 శాతం, రూ.12-15 లక్షలపై 20 శాతం, రూ.15 లక్షలపై 30 శాతం పన్ను విధిస్తామని తెలిపింది. అలాగే రూ.7లక్షల వరకు (రిబేట్ అనంతరం) ఎలాంటి పన్నూ ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.