దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు పొందింది. సాధారణంగా ఇక్కడ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ ధర రూ.కోటి పైనే ఉంటుంది. అలాంటిది అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు కొనుగోలు చేయాలంటే మాత్రం పదులు, వందల కోట్లు కుమ్మరించాల్సిందే. అయితే, ఇటీవలే ఈ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడంతస్తుల ఫ్లాట్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఆ ట్రిప్లెక్స్ ఇంటి ధర అక్షరాలా రూ.369కోట్లు. మరి అంత ఖరీదైన ఇంటిని ఎవరు కొన్నారో తెలుసా?
ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు ఈ ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ ప్రాంతంలో రూ.369 కోట్లతో ఓ లగ్జరీ ట్రిప్లెక్స్ ఫ్లాట్‌ను వీరు కొన్నారు. తపారియా కుటుంబం బీచ్ వ్యూ ఉన్న ఈ లగ్జరీ ఇంటిని లోధా గ్రూప్‌నకు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబయిలో సూపర్ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్ ప్యాలెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ ఉంది. ఈ ఫ్లాట్ వైశాల్యం 27,160 చదరపు అడుగులు. అంటే ఒక్కో చదరపు అడుగును జేపీ తపారియా కుటుంబం రూ.1.36 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. చదరపు అడుగుల ఆధారంగా చేసుకుంటే.. దేశంలో ఇదే అత్యంత విలువైన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ డీల్ అని కొందరు అంటున్నారు. అయితే ఈ ఫ్లాట్‌కు కొనుగోలు చేసేందుకు తపారియా కుటుంబం స్టాంప్ డ్యూటీ కిందనే రూ.19.07 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
- ఇదే లోధా గ్రూప్ నుంచి ఇటీవలే.. బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ కూడా అత్యంత ఖరీదైన ఓ నివాసాన్ని కొనుగోలు చేశారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడంతస్తుల ఫ్లాట్‌ను ఆయన రూ.252.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ముంబయి నగరంలో ఖరీదైన ప్రాంతం, బీచ్ వ్యూ వంటి కారణాలతో.. ఈ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లు ఇంత ఖరీదు పలుకుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఇక, గత నెలలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌ను కొనుగోలు చేశారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ కుటుంబం రూ.1,238 కోట్లతో 28 ఫ్లాట్లను కొనుగోలు చేసింది.
మార్చి నెలలో భారీగా విలాస భవనాల కొనుగోలు!
ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలోకి వస్తుంది. దీంతో మూలధన లాభాలపై పన్నుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలవుతాయి. దీని ప్రకారం ఏప్రిల్ 1 తరువాత రూ.10 కోట్లు పైబడిన మూలధన లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టినా ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. కనుక మార్చి నెలలో భారీ స్థాయిలో లగ్జరీ నివాస భవనాలు అమ్ముడయ్యాయి.