పసిడిపై దిగుమతి సుంకాన్ని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల బంగారం స్మగ్లింగ్ పెచ్చు మీరవచ్చని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎం.పి. అహ్మద్ అంటున్నారు. దీనివల్ల దేశానికి పన్ను వసూళ్ల ఆదాయంలో నష్టం వాటిల్లడంతో పాటు.. సంస్థాగత ఆభరణాల రంగంపైనా ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పసిడి దిగుమతులపై సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి జులై 1న కేంద్రం పెంచింది. రూపాయి క్షీణతను, కరెంట్ ఖాతా లోటును అదుపులో పెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల పసిడి ధరలపై ప్రభావం, గిరాకీ ధోరణులు, యూఏఈతో ఒప్పందం, పండుగల సీజనులో విక్రయాలు తదితర అంశాలపై వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్'కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..
దేశీయ మార్కెట్లో పసిడి ధరలపై ప్రభుత్వ నిర్ణయ ప్రభావం ఉంటుందా.?
వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు 2.5 శాతంతో పాటు పసిడి దిగుమతిపై సుంకాన్ని 15 శాతానికి చేర్చడం వల్ల ఆభరణాల విక్రయాలపై ఎక్కువ ప్రభావం పడవచ్చు. ఈ నిర్ణయం వల్ల పన్నులు ఎగ్గొట్టడానికి పసిడి స్మగ్లింగ్ చేసే వాళ్లు పెరగవచ్చు. దీంతో పన్ను వసూళ్ల నుంచి భారీ ఆదాయాన్ని ప్రభుత్వం పోగొట్టుకోవాల్సి వస్తుంది. పన్ను ఎగవేతలు, స్మగ్లింగ్‌ను అదుపులో ఉంచడానికే ఇటీవల దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అయితే ఇపుడు మళ్లీ పెంచడం వల్ల స్మగ్లింగ్‌కు ఆజ్యం పోసినట్లవుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని కోరుతున్నాం.
వినియోగదార్లపై ఎంత ప్రభావం ఉండొచ్చు.?
దిగుమతి సుంకం పెంపు వల్ల స్మగ్లింగ్, అనధికారిక లావాదేవీలు పెరుగుతాయి. ఇది సంస్థాగత రంగంలోని ఆభరణాల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. అధిక సుంకం వల్ల ఆభరణాల ధరలను పెంచాల్సి ఉంటుంది. ఇది వినియోగదారు సెంటిమెంటుపైనా ప్రభావం చూపిస్తుంది.
మే నెలలో రికార్డు స్థాయిలో భారత్ పసిడిని దిగుమతి చేసుకుంది. గిరాకీ పుంజుకుందనడానికి ఇది సంకేతమా.?
తాజా గణాంకాల ప్రకారం.. క్రితం ఏడాది మేతో పోలిస్తే ఈ మే నెలలో పసిడి దిగుమతులు 677 శాతం పెరిగాయి. దీనిని రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటేమో.. పసిడి ధరల దిద్దుబాటు నుంచి రిటైల్ ఆభరణాల విక్రయాలు పెరిగాయని భావించొచ్చు. ఇంకోటి, రాబోయే పండుగల సీజను, పెళ్లిళ్ల కారణంగా సానుకూల ధోరణి కనిపించి ఉండొచ్చు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అనంతరం భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయా.?
యూఏఈ ఒక ఆకర్షణీయమైన రిటైల్, టోకు మార్కెట్. ఈ ఒప్పందంతో దేశంలో విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. నాణ్యత, వినూత్న డిజైన్‌లను పోటీ ధరలతో అందించడం ద్వారా భారత ఆభరణ తయారీదారులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
రెండేళ్ల కరోనా అనంతరం ప్రపంచం మళ్లీ సాధారణ స్థాయికి చేరుతోంది. మూడో దశ (థర్డ్ వేవ్) అనంతరం పసిడికి గిరాకీ ఎలా ఉంది.?
కరోనా మూడో దశ ప్రభావం పరిమితంగానే ఉన్నా.. జనవరి- మార్చిలో పసిడి గిరాకీ మోస్తరుగానే కనిపించింది. తక్కువ పెళ్లిళ్లు, పెరిగిన పసిడి ధరలు ఇందుకు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ధరల కారణంగా కొంత మంది వినియోగదార్లు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ధరల దిద్దుబాటు వల్ల మే నెలలో అక్షయ తృతీయ సందర్భంగా మార్కెట్ సెంటిమెంటు రాణించింది. అనిశ్చిత పరిస్థితులు సైతం భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారానికి ఊతమిచ్చింది. ఆ తర్వాత అధిక పసిడి ధరలకు వినియోగదార్లు అలవాటు పడ్డారు. అయితే తాజా దిగుమతి సుంకం పెంపుతో మళ్లీ ఆందోళన కలుగుతోంది.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల గత నెలలో పసిడి ధరలపై ప్రభావం కనిపించింది. ఇది దేశీయంగా భౌతిక పసిడి కొనుగోళ్లపై ఎటువంటి ముద్ర వేసింది.?
మన దేశంలో పసిడిని, సంప్రదాయాన్నీ విడదీయలేం. సంపదకు గుర్తుగా దీనిని వాడతారు. ఒక ఆధారపడదగ్గ, భద్రమైన పెట్టుబడి సాధనంగానూ భావిస్తారు. ఫెడ్ రేట్ల పెంపు వల్ల మదుపర్ల వ్యూహాలపై ప్రభావం ఉంటుందేమో తప్ప.. భౌతిక ఆభరణాల గిరాకీని మార్చలేదు. రూపాయి క్షీణత వల్లా ప్రభావమేమీ ఉండదు.
వర్షాకాల సీజను ప్రారంభమైనప్పటి నుంచి చిన్న పట్టణాలు, గ్రామాల్లో గిరాకీ ఎలా ఉంది.?
మంచి వర్షాలు పడితే రైతులతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో అనుబంధమున్న వారికి మేలు జరుగుతుంది. ఈ నెలలో మంచి వర్షాలు కురుస్తాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచీ మంచి గిరాకీనే మేం అంచనా వేస్తున్నాం. 2025 కల్లా 500 కొత్త షోరూములను ఏర్పాటు చేయనున్నాం. దీని వల్ల 11,000 మందికి ఉపాధి లభిస్తుంది.
ఇవీ చదవండి: ముదురుతున్న వివాదం.. ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ కౌంటర్ దావా