MSSC Premature Closure Rules in Telugu: మహిళలు ఆర్థికంగా మెరుగుపడటానికి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల మెచ్యూర్ పీరియడ్‌తో "మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్" (MSSC) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ను ఇప్పటివరకు పోస్టాఫీసులు అందించేవి. ఇకపై బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరి ఈ పథకం ప్రయోజనాలు ఏంటి..? ఎవరు అర్హులు..? ఎలా చేరాలి..? ఒకవేళ మెచ్యూర్ సమయానికి ముందే డబ్బులు అవసరం అయితే ప్రీ మెచ్యూర్ విత్ డ్రా ఛాన్స్ ఉందా..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పథకం వివరాలు: మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఇందులో చేరి పెట్టుబడులు పెట్టిన వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు సంవత్సరానికి 7.5 శాతం స్థిరమైన వడ్డీ అందుకుంటారు. 2025 మార్చి వరకు ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు.
అలర్ట్ - చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మారిన రూల్స్ - మీరు తెలుసుకోవాల్సిందే!
ఎవరు అర్హులు?: భారతదేశంలోని ప్రతీ మహిళ, బాలిక ఈ పథకానికి అర్హులు. మహిళలు సొంతంగా ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. లేదా మహిళల తరపున వారి కుటుంబసభ్యులు లేదా బంధువులు ఓపెన్ చేయవచ్చు. మైనర్ బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా గార్డియన్ తెరవాల్సి ఉంటుంది.
ఎంత వరకు డిపాజిట్ చేయవచ్చు: ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకేసారి రూ.2 లక్షలు డిపాజిట్ చేయవచ్చు లేదా కనిష్ఠంగా రూ.1000 చొప్పున విడతల వారీగా అయినా డిపాజిట్ చేయవచ్చు. ఒకరు.. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా తెరుచుకునే అవకాశముంది. కాకపోతే ఒక ఖాతా తర్వాత మరొక ఖాతా తెరవడానికి.. కనీసం మూడు నెలల గ్యాప్ ఉండాలి.
పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్!
ఎలా చేరాలి?
- స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఫారమ్ తీసుకోవాలి.
- దరఖాస్తులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
- నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.
- ఈ ప్రక్రియ పూర్తైన తరువాత ప్రూఫ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది.
- డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది.
డబ్బులు తిరిగి పొందటం ఎలా?: నిబంధనల ప్రకారం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన 1 సంవత్సరం తర్వాత జమ చేసిన డబ్బులో 40 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
మెచ్యూరిటీకి ముందే అకౌంట్ క్లోజ్ చేయవచ్చా..?: మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేసి.. జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీలుంటుంది. అకౌంట్ హోల్డర్ మరణించిన సమయంలో, ఏదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమయంలో, గార్డియన్ చనిపోయినప్పుడు.. డబ్బులు అత్యవసరమని పోస్టాఫీసు లేదా బ్యాంకు ధ్రువీకరించినప్పుడు మాత్రమే పూర్తి డబ్బులు అందే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎటువంటి కారణం లేకుండా ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత మీరు అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే.. మీ వడ్డీ రేటు 2% తగ్గుతుంది. అంటే మీకు 7.5 శాతానికి బదులుగా 5.5 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. దీనిపై వచ్చే ఆదాయానికి నిబంధనల ప్రకారం పన్ను ఉంటుంది.