భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ (క్యూ1) త్రైమాసికంతో పోలిస్తే (13.5 శాతం) సగం వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 5.8 శాతంగా నమోదవ్వచ్చని అంచనాలను వెలువరించింది. ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ వెలువరించిన బులెటిన్‌లో సైతం వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేసింది. అంచనాలకు అటుఇటూగా గణాంకాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో పొరుగు దేశం చైనా వృద్ధి రేటు 3.9 శాతంగా నమోదు కావడం గమనార్హం.