Hurun Global 500 List 2022 : ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో భారత్ నుంచి 20 సంస్థలకు చోటు లభించింది. గతేడాది ఈ జాబితాలో మన కంపెనీలు 8 మాత్రమే ఉన్నాయి. ఈసారి జాబితాలో అత్యధిక కంపెనీలున్న దేశాల్లో కెనాడాతో పాటు అయిదో స్థానాన్ని మనదేశం పొందింది. అంతర్జాతీయంగా చూస్తే యాపిల్ 2.4 లక్షల కోట్ల డాలర్ల విలువతో అగ్రస్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ 1.8 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో టాప్-500 కంపెనీలు తమ విలువలో 11.1 లక్షల కోట్ల డాలర్లను కోల్పోయాయి. కొవిడ్ ముందుతో పోలిస్తే మాత్రం ఈ విలువ 7 బిలియన్ డాలర్లు అధికంగానే ఉంది. శుక్రవారం విడుదలైన '2022 హురున్ గ్లోబల్ 500'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందులోని ముఖ్యాంశాలు..
అగ్రస్థానంలో ఆర్‌ఐఎల్.. అదానీ కంపెనీలు 4
భారత్ విషయానికొస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 202 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16.56 లక్షల కోట్ల) విలువతో అత్యంత విలువైన భారత కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయంగా 34వ స్థానంలో ఈ కంపెనీ ఉంది. టీసీఎస్ 139 బి. డాలర్ల (దాదాపు రూ.11.4 లక్షల కోట్ల)తో దేశీయంగా రెండో స్థానంలో; అంతర్జాతీయంగా 65వ స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (97 బి. డాలర్లు) దేశీయంగా మూడో స్థానంలో ఉంది. గౌతమ్ అదానీకి చెందిన 4 కంపెనీలు ఈ అగ్రగామి 500లో చోటు చేసుకున్నాయి. ఈ గ్రూపునకు సంబంధించి 46 బిలియన్ డాలర్లతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అగ్రగామిగా ఉండగా, అదానీ ట్రాన్సిమిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ 4 కంపెనీల మొత్తం విలువ 173 బి. డాలర్లు(సుమారు రూ.14.18 లక్షల కోట్లు)గా ఉంది.
- భారత్ నుంచి ఈ జాబితాలో ఉన్న 20 కంపెనీల్లో 11 ముంబయిలో, 4 అహ్మదాబాద్‌లో ఉన్నాయి. నోయిడా, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, పుణెలలో ఒకటి చొప్పున ఉన్నాయి.
- అంతర్జాతీయంగా ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, టెస్లా, బెర్క్‌షైర్ హాథ్‌వే, జాన్సన్ అండ్ జాన్సన్, ఎక్సాన్ మొబిల్ టాప్-10లో నిలిచాయి.ఆర్థిక రంగం నుంచి అత్యధికంగా 104 కంపెనీలు ఉన్నాయి. ఇందులోనూ యునైటెడ్ హెల్త్ గ్రూప్, వీసా టాప్-10లో ఉన్నాయి.
- 2.4 లక్షల కోట్ల డాలర్ల విలువున్న మీడియా-వినోద రంగం 2021లో చాలా వరకు కోల్పోయింది. మెటా గతేడాది 618 బి. డాలర్లను కోల్పోయి 349 బి. డాలర్లకు పరిమితమైంది.
- జూమ్, స్నాప్, అడిడాస్, డెల్ టెక్నాలజీస్ ఈ జాబితా నుంచి నిష్క్రమించాయి.
- దేశీయంగా ఎస్‌బీఐ (62 బి. డాలర్లు), ఎల్‌ఐసీ(45 బి.డాలర్లు) అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2.03 లక్షల కోట్ల డాలర్లతో సౌదీ ఆరామ్‌కో ప్రభుత్వరంగ సంస్థల్లో మొదటి ర్యాంకులో ఉంది. గ్లోబల్ 500 జాబితా కేవలం ప్రభుత్వేతర కంపెనీలది కావడం వల్ల ఇవి అందులో కనిపించలేదు.
- ఈ ఏడాది భారత్ నుంచి కొత్తగా ఐటీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్సిమిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్ అండ్ టీలు జాబితాలో జత చేరాయి.