How To Get Free Insurance With Debit Card : మన దేశంలో నగదు చెల్లింపులకు అధిక శాతం మంది డెబిట్ కార్డుల్ని ఉపయోగిస్తారు. ఈ మధ్య కాలంలో యూపీఐ సంబంధిత అప్లికేషన్లు కూడా వాడుతున్నారు. కానీ ఇంతకు ముందు ఆన్లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలకు ఏటీఎం కార్డుల్నే వాడేవారు. అంతేకాకుండా ATMల నుంచి నగదు ఉపసంహరణ చేసేవాళ్లు. షాపింగ్ మాల్స్‌లోనూ డెబిట్ కార్డు ఉపయోగించి కొనుగోళ్లు చేసేవారు.
జీవిత బీమా తప్పనిసరి
ఈ కాలంలో దాదాపుగా అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. భవిష్యత్ ఆర్థిక రక్షణ కోసం ఈ జీవితా బీమా పాలసీలను తీసుకుంటున్నారు. కానీ మీకో విషయం తెలుసా? ఒకవేళ మీరు ఎలాంటి బీమా చేయించుకోకపోయినా.. మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. అదెలాగంటారా ? సింపుల్! మీ దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంటే చాలు.. మీకు బీమా వర్తిస్తుంది. పలు డెబిట్ కార్డు కంపెనీలు వాటిపై బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అందుకే వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్
చాలా డెబిట్ కార్డులు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. ఇవి పర్సనల్ యాక్సిడెంట్ సహా.. ఇతర కవరేజీలు అందించి వివిధ రిస్కుల నుంచి కాపాడతాయి. అయితే డెబిట్ కార్డు రకం, అకౌంట్ టైపు, కార్డు హోల్డర్లను అనుసరించి ఈ కవరేజీ అమౌంట్ మారుతుంది.
"అన్ని డెబిట్ కార్డులు ఒకే రకమైన బీమా కవరేజీలను అందించవు. ఇది కార్డ్ హోల్డర్ ఖాతా, కార్డు రకాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. రెగ్యులర్ లేదా సాధారణ కార్డుల కన్నా... ప్రైవేటు లేదా ప్రీమియం కార్డులు మెరుగైన బీమా కవరేజీని అందిస్తాయి." -
సచిన్ వాసుదేవ, పైసా బజార్ డైరెక్టర్
ఉదాహరణకు.. యాక్సిస్ బ్యాంక్ Burgundy డెబిట్ కార్డును.. Burgundy ప్రైవేట్ మెంబర్స్‌కు మాత్రమే అందిస్తుంది. ఇందులో సాధారణం కన్నా.. ఎక్కువ బీమా కవరేజీ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో పర్సనల్ యాక్సిడెంట్, ఫ్లైట్ ప్రమాదాలు, బ్యాగేజీ లాస్, పర్చేస్ ప్రొటెక్షన్ కవరేజీ లాంటివి ఉన్నాయి. ఇదే బ్యాంకుకు సంబంధించిన Liberty debit cardలో పర్సనల్, ఫ్లైట్ యాక్సిడెంట్ మాత్రమే కవరవుతాయి. ఈ రెండు కార్డుల మధ్య తేడా గమనిస్తే.. Burgundy డెబిట్ కార్డుతో మీరు రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని పొందుతారు. కానీ Liberty కార్డుతో కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది.
ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
ముందుగా చెప్పినట్లే.. ఈ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ క్లెయిమ్ ప్రాసెస్ కూడా.. కార్డు, ఖాతా రకాన్ని అనుసరించి మారుతుంది. వాస్తవానికి మనం ఎలాంటి దరఖాస్తు చేయకున్నా.. డెబిట్ కార్డు ద్వారా కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. అయితే డెబిట్ కార్డు ప్రొవైడర్, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలోని షరతులు అన్నీ పాటిస్తేనే.. మనకు బీమా కవరేజ్ లభిస్తుంది. అంతేకాదు... క్లెయిమ్ కోసం అవసరమైతే, పర్సనల్ యాక్సిడెంట్‌కి సంబంధించిన పోలీసు నివేదిక లాంటి అవసరమైన ధ్రువ పత్రాలు అన్నింటినీ నిర్దిష్ట సమయంలోపు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే క్లెయిమ్ చేయడానికి ముందు మీ డెబిట్ కార్డ్ బీమా కవరేజీకి సంబంధించిన నిబంధనలను, షరతులను జాగ్రత్తగా చదవాలి. అప్పుడే మీరు మీ డెబిట్ కార్డ్ ప్రయోజనాలను సంపూర్ణంగా పొందగలుగుతారు.
అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ FD స్కీమ్స్ ఇవే! కొద్ది రోజులే ఛాన్స్!
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్ కార్డ్‌తో సింపుల్‌గా చెక్ చేసుకోండిలా!