ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. అయితే గూగుల్ కూడా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. అందులో హైదరాబాద్ గూగుల్‌కు చెందిన స్టార్ పెర్ఫామర్ కూడా ఉన్నారు. హర్ష్ విజయ్‌వర్గీయ ఫిబ్రవరిలో హైదరాబాద్ గూగుల్‌లో స్టార్ పెర్ఫామర్‌గా నిలిచారు. అయినా ఆయనను తొలగిస్తున్నట్లు సంస్థ నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారి ఆయన నిరాశకు గురయ్యారు.
'నా జీతం గత రెండు నెలలుగా సగానికి పడిపోయింది.. దీంతో నా ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను ఫిబ్రవరిలో స్టార్ పెర్ఫార్మర్గా ఉన్నా. నన్ను ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించారో అర్థం కావడం లేదు.' అని హర్ష్ విజయవర్గీయ లింక్డిన్లో రాసుకొచ్చారు. శనివారం గూగుల్ కార్యాలయం నుంచి మెయిల్ వచ్చిందని.. అందులో తనను తొలగిస్తున్నట్లు ఉందని వాపోయారు.
డెల్ ఉద్యోగులకూ షాక్..
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్ సంస్థ కూడా ఇటీవల తమ సంస్థలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 5 శాతం అని కంపెనీ కో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లోనూ..
సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ కొన్నాళ్ల క్రితం 600 ఉద్యోగులను తొలగించింది. ఇన్ఫోసిస్ నిర్వహించిన ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) టెస్ట్‌లో ఫెయిలైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది 2022 జులైలో నియమితులైనవారేనని తెలిపింది.
ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్లోనూ..
ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ కూడా ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నష్టాల కారణంగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఫిలిప్స్ తెలిపింది. 3 నెలల క్రితమే ఆ సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. తాజాగా 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.