Reliance Fortune 500 company : ఫార్చ్యూన్-500 లిస్ట్‌లో ఒకేసారి 51వ స్థానాలు ఎగబాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 దిగ్గజ కంపెనీల్లో గతేడాది 155వ స్థానంలో ఉన్న రిలయన్స్.. ఈసారి 104వ ర్యాంకుకు చేరుకుంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం ఆధారంగా ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలకు ర్యాంకులు కేటాయిస్తూ ఈమేరకు కొత్త జాబితా విడుదల చేసింది ఫార్చ్యూన్.
Fortune 500 Indian companies 2022 : ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో మొత్తం 9 భారతీయ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు కాగా, నాలుగు ప్రైవేటువి. ఇటీవల ఐపీఓకు వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫార్చ్యూన్ 500 లిస్ట్‌లో 98వ స్థానంలో ఉంది. ఫార్చ్యూన్ జాబితాలో అగ్రగామిగా ఉన్న భారతీయ సంస్థ ఇదే. దీని తర్వాత స్థానంలో రిలయన్స్ ఉంది. ప్రైవేటు సంస్థలపరంగా చూస్తే.. ఫార్చ్యూన్ 500 జాబితాలో అగ్రస్థానం రిలయన్స్‌దే. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ.. ఫార్చ్యూన్ లిస్ట్‌లో వరుసగా 19వ ఏడాది చోటు దక్కించుకోవడం గమనార్హం. భారత్‌లోని మరే ఇతర ప్రైవేటు కంపెనీకి ఈ ఘనత దక్కలేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఆదాయం రూ.792,756 కోట్లు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ఫార్చ్యూన్ 500 లిస్ట్‌లో 142వ స్థానంలో నిలిచింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 190వ ర్యాంకు పొందింది. భారతీయ స్టేట్ బ్యాంకు 236, భారత్ పెట్రోలియం 295వ స్థానాల్లో నిలిచాయి. టాటా మోటర్స్, టాటా స్టీల్, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్.. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లోని ఇతర భారతీయ ప్రైవేటు సంస్థలు.