Fixed Deposit Rates: ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థకు తక్కువ వడ్డీ రేట్లు అవసరమే. రెండేళ్లుగా మనం చూస్తున్న పరిణామం ఇదే. ఇప్పుడు ద్రవ్యోల్బణం 6 శాతం వరకు ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఒకటి రెండేళ్ల నుంచి పన్నుకు ముందు 4.9%-5.1% వరకు రాబడినిస్తున్నాయి. పన్ను తర్వాత వాస్తవంగా వచ్చేది చాలా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్‌డీ లు పెట్టుబడి వృద్ధికి ఏమాత్రం తోడ్పడవనే చెప్పాలి. పైగా డబ్బు విలువనూ ఇవి తగ్గిస్తున్నాయి. తాజాగా వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి. అనుకున్నంత మేరకు ఇవి ఇంకా చేరుకోలేదు. ద్రవ్యోల్బణం పెరిగితే.. వచ్చే నికర రాబడి తగ్గుతుంది. వడ్డీపైనే ఆధారపడి ఉండే సీనియర్ సిటిజన్లకు ఇది ఇబ్బందికరమైన పరిణామమే. జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వడ్డీ ఆదాయం తగ్గడం వారికి చిక్కులను తెచ్చిపెడుతోంది.
అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో అయిదేళ్ల వ్యవధికి మించిన వడ్డీ రేట్లు 4.9%-5.50% వరకు ఉన్నాయి. ఉదాహరణకు కెనరా బ్యాంక్ అయిదు, పదేళ్ల మధ్య కాల వ్యవధి డిపాజిట్లపై 5.50శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ అందిస్తోంది. మూడేళ్ల వరకు తక్కువ కాలావధి డిపాజిట్లపై రేట్లు సాధారణంగా 4.9శాతం, 5.3శాతం మధ్య ఉంటాయి. కొన్ని బ్యాంకులు 5.45 శాతం వరకు అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లోనూ ఒకటి, రెండు, మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై 5.5శాతం వడ్డీ రేటను అందిస్తోంది. అయిదేళ్ల డిపాజిట్లపై గరిష్ఠంగా 6.7 శాతం వడ్డీనిస్తోంది.
ప్రైవేటు బ్యాంకుల తీరూ ఇలాగే ఉంది. కొన్ని బ్యాంకులు 6.25-6.5శాతం వరకు అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ రెండేళ్లు-61 నెలల మధ్య కాలావధి డిపాజిట్లపై 6.5శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడీ రేట్లను ప్రకటించింది. చాలా బ్యాంకులు 5.75 శాతం పైన వడ్డీనిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్ల కోసం దీర్ఘకాలానికి డిపాజిట్లు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త అధిక వడ్డీ కోసం చూస్తుంటే.. ప్రైవేటు బ్యాంకులను పరిశీలించవచ్చు. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి, దీర్ఘకాలిక డిపాజిట్లు చేయొద్దు. తక్కువ వడ్డీ వస్తున్నా.. స్వల్ప వ్యవధి డిపాజిట్లనే ఎంచుకోవాలి. రేట్లు పెరిగిన తర్వాత వాటిని దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేయండి. 2022లో రేట్ల పెరుగుదలకే ఎక్కువ అవకాశాలున్నాయి.
చిన్న బ్యాంకుల్లో..: పెద్ద బ్యాంకుల్లో డిపాజిటర్లకు నష్టభయం అంతగా ఉండదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అయిదేళ్లకు పైబడిన డిపాజిట్లపై 5.45%-6.3 శాతం వడ్డీని ప్రకటించాయి. అదే అవధికి ఎస్‌బీఐ వడ్డీ రేట్లు 5.5%-6.3% వరకు ఉన్నాయి. చిన్న బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీని అందిస్తున్నాయి. ఉదాహరణకు మూడేళ్ల వ్యవధికి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.5శాతం వడ్డీనిస్తోంది. చిన్న బ్యాంకులను ఎంచుకునే సమయంలో డిపాజిటర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్లు వేయొద్దు. బ్యాంకుల్లో రూ.5లక్షల లోపు డిపాజిట్లకు డిపాజిటరీ ఇన్సూరెన్స్ లభిస్తుంది.
కంపెనీల్లో..: వడ్డీ ఆదాయంపైనే ఆధారపడిన వారు.. కంపెనీ డిపాజిట్లనూ పరిశీలించవచ్చు. ఏఏఏ రేటింగ్ ఉన్న వాటిల్లో జమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ 99 నెలల వ్యవధికి 6.8శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్లు అదనం. ఏఏ రేటింగ్ ఉన్న శ్రీరామ్ సిటీ 60 నెలల వ్యవధికి 7.75శాతాన్ని, సీనియర్ సిటిజన్లకు 8.05శాతం వడ్డీని ఇస్తోంది. కంపెనీ డిపాజిట్లలో నష్టభయం ఉంటుంది. డిపాజిటరీ ఇన్సూరెన్స్ వర్తించదు. దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నవారు ఎఫ్‌డీ లకన్నా.. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్లు, స్థిరాస్తుల్లాంటివి ఎంచుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: పదవీ విరమణ తర్వాత.. ప్రశాంతంగా ఉండాలంటే?