ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వచ్చే కొన్ని నెలల వ్యవధిలో వేల మందిపై వేటు వేయనున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పలు దఫాలుగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. గతేడాది మెటా.. సుమారు 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. ఈ సారి కూడా దాదాపు 11 వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్- ఇంజినీరింగ్ రోల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులను సైతం ఆపివేయనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వీటితో పాటుగా కొన్ని టీమ్‌లను సైతం రద్దు చేయనుందని తెలిపింది. వాల్‌స్ట్రీట్ కథనం ప్రకారం.. మెటాకు సంబంధించిన హార్డ్‌వేర్, మెటావర్స్ డివిజన్ అయిన రియాల్టీ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తీసేయనున్నారు. రియాల్టీ ల్యాబ్స్‌లో వియరబుల్ డివైజెస్‌ను అభివృద్ధి చేస్తున్న బృందాలపై వేటు వేయనున్నారు. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగే పరిశోధనలపై ఈ వేటు ప్రభావం ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
షేరు జూమ్..
ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగుల వేటు ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులపై వేటు కథనం గురించి తెలియగానే అమెరికా స్టాక్ మార్కెట్లో మెటా షేర్లు దూసుకెళ్లాయి. కంపెనీ షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో మెటా షేరు విలువ 2శాతం పెరిగింది.
అయితే, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగుల తొలగింపుపై గతంలోనే పరోక్ష సూచన చేశారు. కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయనున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. 'మా వనరులను అధిక వృద్ధి ఉండే విభాగాల్లో వినియోగించేలా చూస్తున్నాం. రియాల్టీ ల్యాబ్స్ సహా మెటాలోని ఇతర యాప్స్‌లో ఉద్యోగులు ఎలా ఉన్నారనేది పరిశీలిస్తున్నాం' అని మెటా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ సుసాన్ లీ గురువారం వెల్లడించారు.
ఇటీవల దిగ్గజ సాంకేతిక సంస్థలు వరుసగా తమ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి బడా కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3లక్షలు దాటిందని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ అనే వెబ్సైట్ అంచనా వేసింది.
గూగుల్ సైతం 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల వెల్లడించింది. స్టార్ పెర్ఫార్మర్లను సైతం తొలగించేందుకు వెనకాడటం లేదు. హైదరాబాద్ గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఓ స్టార్ పెర్ఫార్మర్‌ను విధుల్లో నుంచి తొలగిస్తూ ఇటీవల మెయిల్ పంపింది ఆ సంస్థ. దీంతో ఒక్కసారి ఆయన నిరాశకు గురయ్యారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.