Elon Musk Twitter Layoff : ట్విట్టర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దాదాపు సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు కొత్త యజమాని ఎలాన్ మస్క్. దీనిపై విమర్శలు వ్యక్తమవడంతో స్పందించిన మస్క్ ఉద్యోగుల కోతలను సమర్థించారు. కంపెనీ రూ.వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్లో తెలిపారు.
"ట్విట్టర్ రోజుకు 4 మిలియన డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు.. దురదృష్టవశాత్తూ సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదు. అయితే కంపెనీ నుంచి నిష్క్రమించిన ప్రతి ఉద్యోగికి మూడు నెలల వేతన చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50శాతం ఎక్కువే" అని మస్క్ రాసుకొచ్చారు.
44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ .. వారం రోజుల్లోనే సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రక్రియ ముగిసిన కొద్ది గంటలకే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతోద్యోగులను విధుల నుంచి ఇంటికి పంపించేసిన ఆయన.. తాజాగా కంపెనీలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలికారు. తొలగింపు సమాచారాన్ని ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా పంపారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 7500 వరకు ఉద్యోగులుండగా.. 3738 మందికి ఈ లేఆఫ్ మెయిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లకు ముందు ఉద్యోగులు, వినియోగదార్ల డేటా భద్రత దృష్ట్యా తాత్కాలికంగా అన్ని కార్యాలయాలను ట్విట్టర్ మూసివేయనుంది.
వారి వల్లే రెవెన్యూ తగ్గింది..
ఇక ట్విట్టర్ ఆదాయం తగ్గడానికి సామాజిక కార్యకర్తలే కారణమని ఎలాన్ మస్క్ మండిపడ్డారు. "కంటెంట్ నియంత్రణలో ఏమీ మారనప్పటికీ కొందరు సామాజిక కార్యకర్తలు.. ప్రకటనదారులపై ఒత్తిడి చేశారు. దీనివల్లే ట్విట్టర్ ఆదాయం భారీగా పడిపోయింది. కార్యకర్తలను శాంతింపజేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా గందరగోళంగా ఉంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వారు నాశనం చేస్తున్నారు" అని మస్క్ తెలిపారు. అయితే సంస్థకు ఎంతమేర నష్టం కలిగిందని, ఆ కార్యకర్తలు ఎవరు అన్నదానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ట్విట్టర్ ఇండియాలో తొలగింపులు?
తొలగింపుల ఎఫెక్ట్ ట్విట్టర్ ఇండియాపై కూడా పడింది. భారత్‌లో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సేల్స్, ఇంజినీరింగ్ వాటి అనుబంధ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇక ట్విట్టర్ ఇండియాలో ఉన్న సగం మంది ఉద్యోగులను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి : ట్విట్టర్లో ఉద్యోగాల కోత మొదలు.. వారందరికీ మెయిల్స్.. ఆఫీసులు బంద్
రాత్రంతా ఆఫీస్‌లోనే నిద్రపోయిన ఉద్యోగి.. 3700 మంది ఎంప్లాయిస్‌కు మస్క్ షాక్