E rupee RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) త్వరలోనే డిజిటల్ రూపాయి (ఇ-రూపీ/e₹)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూ.. చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చెలామణీని అరికట్టేందుకు 'డిజిటల్ రూపాయి' ప్రతిపాదనను ఆర్‌బీఐ చేసింది. 'సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)'గా వ్యవహరించే ఇ-రూపీపై కాన్సెప్ట్ నోట్(నమూనా పత్రం)ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఇపుడున్న కరెన్సీ నోట్లకు జతగా డిజిటల్ రూపాయి వస్తుంది. ప్రస్తుత చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. అదనపు చెల్లింపు అవకాశంగా ఇది మారుతుందని పేర్కొంది.
రెండు రకాలుంటాయ్..
సీబీడీసీలో ఒకటి సాధారణ లేదా రిటైల్ (సీబీడీసీ-ఆర్) అవసరాలకు వినియోగించేది అయితే, మరొకటి టోకు (సీబీడీసీ-డబ్ల్యూ) అవసరాలకు వినియోగించేలా వర్గీకరిస్తారు. రిటైల్ సీబీడీసీని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సీబీడీసీ ని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగిస్తాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 60 కేంద్ర బ్యాంకులు సీబీడీసీపై ఆసక్తి చూపాయని ఆ కాన్సెప్ట్ నోట్ పేర్కొంది.
ఎందుకు తీసుకొస్తున్నారంటే..
- ప్రస్తుత కరెన్సీ నోట్లు, నాణేల నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి
- నగదు చెలామణీ తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థను సాధించడానికి
- చెల్లింపుల్లో పోటీ, సామర్థ్యం, వినూత్నత పెంచడానికి
- విదేశీ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి
- క్రిప్టో ఆస్తుల నుంచి సామాన్యులను రక్షించి.. దేశీయ కరెన్సీపై విశ్వాసం పెంచడానికి
ఇప్పుడూ డిజిటల్ రూపంలో నగదు ఉంది కదా..
ప్రస్తుతం మన నగదును డిజిటల్ రూపంలోకి మార్చుకుని, వినియోగించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు బాధ్యత వాణిజ్య బ్యాంకులది అయితే, సీబీడీసీ చెల్లింపులకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుంది.
ఉపయోగాలివీ..
సీబీడీసీ అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్లలో ఇది కనిపిస్తుంది. అందరు పౌరులు, కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు చట్టబద్ధ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. వాణిజ్య బ్యాంకుల నగదుతో దీనిని మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతా అవసరం ఉండదు. నగదు జారీ, లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశం ఉంది.
క్రిప్టోకు.. దీనికి తేడా ఏమిటంటే..
ఇటీవలి కాలంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరిగింది. అయితే వాటి ద్వారా అక్రమ నగదు చెలామణీ(మనీ లాండరింగ్), ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం వంటివి చేసే అవకాశం ఉంది. క్రిప్టో వల్ల ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడే ప్రమాదం ఉంది. దేశీయ కరెన్సీ స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుంది. అందుకే సీబీడీసీని అభివృద్ధి చేసి, ప్రజలకు నష్టభయం లేని వర్చువల్ కరెన్సీని అందించడమే తమ ఉద్దేశమని ఆర్‌బీఐ కాన్సెప్ట్‌నోట్ వివరిస్తోంది.
ఇవీ చదవండి: భారత్ వృద్ధి 6.5 శాతమే.. అంచనాలను తగ్గించిన వరల్డ్ బ్యాంక్
ఐటీ నియామకాలు తగ్గనున్నాయా? అమెరికా, ఐరోపాల్లో మాంద్యం వల్లేనా!