Airtel Tariff Hike : ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పెంచింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన బేస్ ప్లాన్ ధరను 57 శాతం పెంచి రూ.155కు చేర్చింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ నెలవారీ రీచార్జ్ ప్లాన్ రూ.99 రూపాయలుగా ఉంది. ఇందులో 200 మెగాబైట్ల డేటా, రూ.99 టాక్టైక్ (రూ.2.5/సెకను) 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా దీన్ని తొలుత హరియాణా, ఒడిశా సర్కిళ్లలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని చెప్పాయి.
28 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఎసెమ్మెస్, డేటాతో కూడిన అన్ని కాలింగ్ ప్లాన్లను రద్దు చేసే యోచనలో ఎయిర్‌టెల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఎసెమ్మెస్ సేవలు కావాలనుకున్న ప్రతిఒక్కరూ రూ.155తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా ఎయిర్‌టెల్ అధికారికంగా స్పందించలేదు. ఎయిర్‌టెల్ 2021లోనూ ఇలాగే రూ.79తో ఉన్న కనీస ప్లాన్‌ను ఉపసంహరించుకొని దాని స్థానంలో రూ.99 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అప్పుడు కూడా తొలుత కొన్ని సర్కిళ్లలో ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసింది.
అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మార్కెట్లో మొదటగా ఇలాంటి టారిఫ్ పెంపు నిర్ణయం తీసుకుంది భారతీ ఎయిర్‌టెల్ మాత్రమేనని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్‌లు సంజేశ్ జైన్, ఆకాశ్ కుమార్ తెలిపారు. 'ఈ విషయంపై మార్కెట్లో ఉన్న ఇతర కాంపిటీటర్లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. ఈ టారిఫ్ పెంపునకు సరైన స్పందన రాకుంటే నిర్ణయాన్ని ఎయిర్‌టెల్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరి తర్వాత ఏ టెలికాం సంస్థ టారిఫ్‌ను పెంచుతారో వేచిచూడాలి' అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి : బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు షురూ.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ
భారీగా పెరిగిన EPFO చందాదారులు.. దాదాపు 9లక్షల మంది కొత్తగా..