కరోనా వైరస్ మహమ్మారి భయాలతో స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం భారీ విక్రయాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ట్రేడింగ్‌లో సూచీలు లోయర్ సర్య్కూట్‌ను తాకాయి. ఇక చేసేదేమీ లేక ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సూచీలు లోయర్ సర్క్యూట్లకు పడ్డాయి. స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకుల్ని అరికట్టేందుకు ఎక్స్ఛేంజీలు మూడు దశలో సర్క్యూట్‌లను ఏర్పాటు చేస్తాయి. 10 శాతం, 15 శాతం, 20 శాతం మేర సూచీలు పతనమైతే ట్రేడింగ్ నిలిపివేస్తారు. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే..
గత ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీలు 10 శాతం, 15 శాతం, 20 శాతం చొప్పున క్షీణిస్తే సర్య్కూట్ బ్రేకర్లు ట్రిగ్గరవుతాయి. అప్పుడు ట్రేడింగ్ నిలిపివేస్తారు.
10 శాతానికి వస్తే..
- మధ్యాహ్నం 1 గంటలోపు 10 శాతం సూచీలు పడిపోతే, ట్రేడింగ్ 45 నిమిషాల పాటు నిలిపేస్తారు.
- ఒకవేళ మధ్యాహ్నం 1-2.30 గంటల మధ్య 10 శాతం క్షీణత నమోదైతే 15 నిమిషాలు ట్రేడింగ్ ఆపేస్తారు. తర్వాత యథావిధిగా ట్రేడింగ్ జరుగుతుంది.
- మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత 10 శాతం క్షీణించినా ట్రేడింగ్ ఆగదు.
15 శాతంలో..
- సూచీలు మధ్యాహ్నం ఒంటి గంటలోపు 15 శాతం కుంగిపోతే 1.45 గంటలు ట్రేడింగ్‌ను నిలిపివేస్తారు.
- 1-2 గంటల మధ్య 15 శాతం మేర క్షీణిస్తే 45 నిమిషాల పాటు ట్రేడింగ్ ఆపేస్తారు.
- మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 శాతం క్షీణత నమోదైతే తర్వాత ట్రేడింగ్‌ను ఆ రోజంతా పూర్తిగా నిలిపేస్తారు.
20 శాతం..
ఒకవేళ రోజులో ఏ సమయంలోనైనా సూచీలు 20 శాతం లోయర్ సర్య్కూట్‌కు పడిపోతే తర్వాత మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను నిలిపివేస్తారు.
ఇదీ చూడండి: రికార్డు నష్టాల నుంచి తేరుకొని భారీ లాభాల్లోకి