దేశంలో సేవా రంగ కార్యకలాపాలు సెప్టెంబర్లోనూ సానుకూలంగా నమోదయ్యాయి. మరిన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షల సడలింపు, పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణం. అయితే ఆగస్టుతో పోల్చితే మాత్రం సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కాస్త తగ్గినట్లు (Services sector PMI) ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక ద్వారా తెలిసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
సెప్టెంబర్లో సేవా రంగ పీఎంఐ (PMI in September) స్కోరు. 55.2గా నమోదైంది. ఆగస్టులో ఇది 18 నెలల గరిష్ఠ స్థాయి అయిన 56.7గా వద్ద ఉంది.
సాధారణంగా పీఎంఐ స్కోరు 50కి పైన ఉంటే ఆ రంగం వృద్ధి బాటలో ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే.. క్షీణత దశలో ఉన్నట్లు చెబుతుంటారు నిపుణులు.
దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు మరింత సడలించడం వల్ల.. సేవా రంగంలోని సంస్థలు వ్యాపారం పెంచుకోగలిగాయి. అయితే వ్యాపార విశ్వాసం మాత్రం ఇంకా ప్రతికూలంగానే ఉంది.
ఉద్యోగాల పరంగా సేవా రంగంలో వరుసగా తొమ్మిది నెలలుగా నమోదైన క్షీణతకు సెప్టెంబర్లో బ్రేక్ పడింది. గత నెల స్వల్పంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే చాలా సంస్థలు తమ అవసరాలకు సరిపోయేంత సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: అయ్యో మార్క్.. రాత్రికి రాత్రే రూ.52 వేల కోట్లు లాస్!