దేశంలో ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను ఆదా పెట్టుబడులు సహా, ఆలస్యంగా ఆదాయపన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు ఇదే చివరి తేది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది కేంద్రం. గడువు ముగిసేందుకు ఇంకా 9 రోజులే ఉంది. ఈ లోపు పూర్తి చేయాల్సిన 4 తప్పనిసరి పనులు.. వాటి వివరాలు మీ కోసం.
పన్ను ఆదా పెట్టుబడి
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమర్పించేందుకు జూన్ 30 చివరి తేదీ. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ పన్నుల ఫారంలో కొత్త టేబుల్‌ను జత చేసింది. ఇందులో ఏప్రిల్, జూన్‌లో 2019-20కి సంబంధించి పెట్టిన పెట్టుబడుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఆలస్య ఐటీఆర్ (2018-19)దాఖలు..
సాధారణంగా ఐటీఆర్ దాఖలుకు జులై 31 చివరి తేదీ. అయితే మదింపు సంవత్సరం ముగిసే వరకు (మార్చి 31 వరకు) రిటర్ను దాఖలు చేసే వీలుంటుంది. లాక్డౌన్ కారణంగా ఈ గడువు కూడా ఈ జూన్ 30 వరకు పెరిగింది. ఇంకా మీ రిటర్ను దాఖలు చేయకపోతే వెంటనే చేయడం మంచిది.
ఇప్పటికే రిటర్ను దాఖలు చేసిన వారు మరోసారి దాఖలును సమీక్షించుకునేందుకు కూడా వీలుంటుంది.
చిన్న పథకాల్లో పెట్టుబడి..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్యా సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి పథకాల్లో ఆర్థిక సంవత్సరం ముగింపులోగా కనీస పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటికీ గడువు పెంచిన నేపథ్యంలో జూన్ 30లోపు కనీస పెట్టుబడి పెట్టి.. మీ ఖాతాను క్రియాశీలంగా ఉంచుకోండి.
పీపీఎఫ్‌లో కనీసం రూ.500, ఎస్ఎస్వైలో రూ.250 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఆధార్-పాన్ అనుసంధానం..
పాన్‌కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం ఇది వరకే తప్పనిసరి చేసింది ఆదాయ పన్ను విభాగం(ఐటీ). ఇందుకు జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పటికే చాలా సార్లు గడవు పెంచిన ఐటీ శాఖ.. మరో సారి గడవు పెంచే అవకాశాలు లేకపోవచ్చు. ఇంకా మీ ఆధార్ కార్డును, పాన్‌కు అనుసంధానం చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి.