జియో-ఫేస్‌బుక్ ఒప్పందంతో భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని తిరిగిపొందారు. బ్లామ్‌బెర్గ్ ఆసియా కోటీశ్వరుల జాబితాలో ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న అలీబాబా గ్రూప్ అధినేత 'జాక్ మా' స్థానాన్ని ముకేశ్ అధిగమించారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియోలో 9.99 శాతం వాటాను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్లు పెరిగి ఒకేసారి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది.
46 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పటి వరకు ఆసియా కుబేరుడిగా ఉన్న జాక్ మాను అధిగమించి ముకేశ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తమ డిజిటల్ విభాగాలన్నింటినీ సంఘటితం చేసి 'జియో ప్లాట్‌ఫామ్స్'గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అతి పెద్ద డిజిటల్ సంస్థగా మార్చేందుకు రిలయన్స్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ లక్ష్య సాధనకు ఫేస్‌బుక్‌తో కుదిరిన ఒప్పందం దోహద పడుతుందని రిలయన్స్ భావిస్తోంది.
ఇదీ చూడండి:'2020-21లో భారత వృద్ధి రేటు 0.8 శాతమే'