కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోంది. మార్చి చివరి వారం నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరోసారి మే 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ సమయంలో టెలీమెడిసిన్కు ఆదరణ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
టెలీకమ్యూనికేషన్ ద్వారా వైద్యులతో ఆరోగ్య సలహాలు తీసుకోడమే టెలీమెడిసిన్.
అప్పుడు వద్దనుకున్నా...
వీడియో కాల్లు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లు, సందేశాల ద్వారా డాక్టర్లను సంప్రదించడం వంటి వాటికి గతంలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు మాత్రం వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆన్లైన్లో ఆరోగ్య సేవలు అందించే ప్రాక్టో, డాక్స్‌యాప్, ఎంఫైన్ వంటి యాప్‌లనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ప్రత్యేక దృష్టి..
ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య రంగంలో పేరొందిన దిగ్గజ సంస్థలు టెలీమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. నారాయణ హృదయాలయ, అపోలో టెలీమెడిసిన్ ఎంటర్ప్రైజెస్, ఏషియా హార్ట్ పౌండేషన్, ఎస్కార్ట్ హార్ట్ ఇన్స్టిట్యూషన్, అరవింద్ ఐ కేర్ వంటి సంస్థలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. భవిష్యత్‌లో టెలీమెడిసిన్కు రానున్న డిమాండ్‌ను ముందే పసిగట్టి.. వాటిని అందిపుచ్చునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అధునాతన సాంకేతికత కోసం ఇస్రో వంటి సంస్థల సహాయం తీసుకుంటున్నాయి.
టెలీమెడిసిన్‌తో లాభాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సుల ప్రకారం వైద్యులు, జనాభా నిష్పత్తి 1:1000గా ఉండాలి. కానీ మన దేశంలో అది 0.62:1000గా ఉంది. ఈ లోటును భర్తీ చేయడంలో టెలీమెడిసిన్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
టెలీమెడిసిన్ ద్వారా ప్రయాణ ఖర్చులు, సమయం, వైద్య ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిపుణులైన వైద్యులను సంప్రదించడం సులభమవుతుందని చెబుతున్నారు.
భారత్‌కు 5 బిలియన్ డాలర్లు ఆదా..
టెలీమెడిసిన్‌ను అభివృద్ధి చేస్తే భారత్‌కు ఏటా 4 నుంచి 5 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని మిక్కిన్సి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ (ఎంజీఐ) 2019లో విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది.
'గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు స్థానికంగా ఉండే అర్హత లేని వైద్యులపై ఆధారపడకుండా నేరుగా నిపుణులనే సంప్రదించే వీలుంటుంది. వైద్యులను సంప్రదించేందుకు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. టెలీమెడిసిన్ ద్వారా ఆ ప్రయాణాల భారం కూడా తగ్గుతుంది' అని నిపుణులు అభిప్రాయపడ్డట్లు నివేదికలో పేర్కొంది మిక్కిన్సి.
టెలీమెడిసిన్కు సవాళ్లు..
టెలీమెడిసిన్ వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ.. సరైన సాంకేతిక మౌలిక సదుపాయాలు లేకపోవడం, టెలీమెడిసిన్ వైద్యులకు తక్కువ పారితోషికాలు ఉండటం వంటివి సవాళ్లుగా ఉన్నాయి. మరోవైపు టెలీమెడిసిన్‌ను సంప్రదించే రోగులకు వారి వ్యక్తిగత గోప్యతపై అనుమానాలు ఉండటం, సరైన అవగాహన లేకపోవడం వంటివి సమస్యలేనని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా చాలా మంది వైద్యుడ్ని నేరుగా కలిసినప్పుడు మాత్రమే చికిత్సపై నమ్మకంగా ఉంటున్నారు. ఇది కూడా టెలీమెడిసిన్కు అడ్డంకిగా ఉన్నట్లు చెబుతున్నారు.
కరోనా కారణంగా టెలీమెడిసిన్ అభివృద్ధికి మరోసారి అవకాశం దొరికింది. రానున్న రోజుల్లో టెలీమెడిసిన్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ముఖ్య పాత్ర పోషించే ఆస్కారముంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలీమెడిసిన్కు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కరోనా సంక్షోభం ముగిసినా టెలీమెడిసిన్కు మాత్రం ఆదరణ తగ్గకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
ఇదీ చూడండి:ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే కరోనా కష్టాల్లోనూ బేఫికర్!