వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే దిగ్గజ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర.. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి తన ఉదారత చాటుకున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తనవంతు ప్రయత్నంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భారత్లో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరువలో ఉందని వైరాలజిస్టులు చెబుతున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు మహీంద్ర. భారీగా బాధితులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫలితంగా వైద్య మౌలిక సదుపాయాలపై ఈ ప్రభావం పడుతుందని అంచనావేశారు. ఇందుకోసం వెంటిలేటర్ల తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు.
"కొన్ని వారాల పాటు లాక్డౌన్తో పరిస్థితులు స్వల్పంగా అదుపులోకి వచ్చే అవకాశముంది. అయినప్పటికీ తాత్కాలిక ఆసుపత్రులు, వెంటిలేటర్లు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మహీంద్ర గ్రూపు సంస్థల్లో వెంటిలేటర్లు తయారీ చేసేందుకు అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నాం.
ప్రస్తుతం మహీంద్ర ఉద్యోగులు సెలవుల్లో ఉన్నారు. మా రిసార్టులను తాత్కాలిక మెడికేర్ సెంటర్లుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం, సైన్యానికి సహకరించేందుకు మా ప్రాజెక్టు బృందం సిద్ధంగా ఉంది."
-ఆనంద్ మహీంద్ర
చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఆదుకునేందుకు మహీంద్ర ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తామన్నారు ఆనంద్.
"మహీంద్ర ఫౌండేషన్ ద్వారా సహాయ నిధిని ఏర్పాటు చేస్తాం. కరోనా కారణంగా చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి సాయమందిస్తాం. మా అనుబంధ సంస్థలు, ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళం అందించేలా ప్రోత్సహిస్తాం. నా 100 శాతం జీతాన్ని దీనికే ఇస్తా. మరికొన్ని నెలల్లో మరింత జమచేస్తా."
- ఆనంద్ మహీంద్ర
100 కోట్ల విరాళం..
వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ కార్యనిర్వాహక ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కరోనాపై యుద్ధానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
"కరోనా మహమ్మారిపై యుద్ధానికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ సమయంలో దేశానికి మన అవసరం ఎంతో ఉంది. చాలా మంది ప్రజలు అనిశ్చితిలో ఉన్నారు. రోజువారీ కూలీల విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. మనకు తోచిన సాయం చేయాలి."
- అనిల్ అగర్వాల్, వీఆర్ఎల్ కార్యనిర్వాహక ఛైర్మన్
ఇదీ చూడండి: 'కరోనా కిట్ల తయారీకి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలి'