ఓలాకు పోటీగా.. మరో దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ.. స్కూటర్ సింపుల్ వన్ పేరుతో తమ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను (ఎక్స్ షోరూం) రూ.1,09,999గా నిర్ణయించింది.
ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లో ఈ స్కూటర్‌ను డెలవరీ చేయనుంది కంపెనీ. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సింపుల్ ఎనర్జీ తెలిపింది.
ఇప్పటికే రూ.1,947 రూపాయలతో ప్రీ ఆర్డర్లు ప్రారంభించింది కంపెనీ. ఫేమ్ 2 రాయితీ పథకం కింద దాదాపు రూ.60 వేల వరకు సబ్సిడీ పొందే వీలుంది. వివిధ రాష్ట్రాలు విద్యుత్ వాహనాలకు ఇస్తున్న రాయితీలతో ఈ స్కూటర్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.
సింపుల్ వన్ ఫీచర్లు..
- మొత్తం నాలుగు రైటింగ్ మోడ్లు (ఎకో, రైడ్, డాష్, సోనిక్)
- 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే
- 30 లీటర్ బూట్ స్పేస్
- 4జీ టెక్నాలజీ అనుసంధానం
- 4.8 కిలో వాట్స్ లీథియం ఆయన్ బ్యాటరీ
- ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 236 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు
- ఎకో మోడ్‌లో 203 కిలో మీటర్లు ప్రయాణించే సామర్థ్యం
- గరిష్ఠ వేగం గంటకు 105 కిలో మీటర్లు
- 0-50 కిలోమీటర్ల వేగాన్ని.. కేవలం 3.6 సెకండ్లలో అందుకుంటుంది
- బ్లూటూత్ కనెక్టివటీ, జియో ఫెన్సింగ్, కాల్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ అనుసంధానం చేసుకునే సదుపాయం, టైర్ ప్రెషర్ మానిటరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం
ఈ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీని పొందు పరిచినట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని 15ఏ సాకెట్ ద్వారా ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని వివరించింది. రానున్న ఏడు నెలల్లో 13 రాష్ట్రాల్లో 300లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
తమిళనాడులోను హోసూర్‌లో రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొదటి దశలో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 10 లక్షల యూనిట్లుగా వివరించింది.
ఇదీ చదవండి: ఓలా ఈ-స్కూటర్ రిలీజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!