Reliance Jio IPO: మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓ ఈ ఏడాదే వచ్చే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి దీన్ని వేరు చేసి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేసేందుకు ముకేశ్ అంబానీ యోచిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే జియోలో 33 శాతం వాటాలను ఇతర సంస్థలకు విక్రయించారు. 2020లో పలు దఫాల నిధుల సమీకరణలో భాగంగా 10 శాతం వాటాలను ఫేస్‌బుక్‌కు, 8 శాతం గూగుల్‌కు కేటాయించారు. మరో 11 సంస్థలకు కూడా జియోలో వాటాలున్నాయి. జియో ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. 2021 అక్టోబరు నాటికి 426.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు జియోను వాడుతున్నారు. జియో లిస్టింగ్‌తో మొత్తం టెలికాం సెక్టార్‌కే ఉత్సాహం లభించనుందని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది.
జియో మాతృసంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే రూ.1.52 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించింది. ఫేస్‌బుక్, గూగుల్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, సహా సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి బడా సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 33 శాతం వాటాలను కొనుగోలు చేశాయి. టెలికాంతో పాటు రిలయన్స్ యాప్స్, డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్, టెక్ సాధనాలను కూడా జియో ప్లాట్‌ఫామ్స్ నిర్వహిస్తోంది.
మరోవైపు 5జీ స్పెక్ట్రం కేటాయింపుల ధరలను తగ్గించకపోతే.. స్పెక్ట్రం వేలం విఫలమయ్యే అవకాశం ఉందని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. 2021లో విక్రయించిన 4జీ స్పెక్ట్రానికి సంబంధించి 11 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో 5జీ కొనుగోళ్లు టెలికాం సంస్థలకు భారంగా మారే అవకాశం ఉందని వివరించింది. అందుకే ధరల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది.