రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) పేరుతో .. ఇటీవలే హరిత ఇంధన వ్యాపారంలోకి ప్రవేశించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ రంగంలో ఓ కంపెనీని కొనుగోలు చేసింది. ఆర్ఈసీ సోలార్ అనే విద్యుత్ కంపెనీని 771 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5,800 కోట్లు) స్వాధీనం చేసుకుంది. ఆర్ఈసీ సోలార్‌లో 100 శాతం వాటాను దక్కించుకున్నట్లు ఆర్ఎస్ఈఎస్ఎల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ చైనా నేషనల్ బ్లాస్టర్ గ్రూప్ అధీనంలో ఉండేది. రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ కొనుగోలు చేసిన తొలి సంస్థ ఆర్ఈసీ సోలార్ కావడం గమనార్హం.
ఆర్ఈసీ ప్రధాన కార్యాలయం నార్వేలో ఉంది. ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్ సింగపూర్‌లో ఉండగా.. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో రీజినల్ హబ్‌లు ఉన్నాయి.
ఆర్ఈసీ కంపెనీ గురించి..
ఆర్ఈసీ గ్రూప్ అంతర్జాతీయంగా గుర్తింపు పొంది సోలార్ ఎనర్జీ కంపెనీ. సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన సోలార్ సెల్స్, సోలార్ ప్యానెల్స్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంటుంది. 25 ఏళ్లుగా ఈ సంస్థ ఈ వ్యాపారాలను సాగిస్తోంది.
ఆర్ఈసీకి నార్వేలో.. సోలార్ గ్రేడ్ పాలీసిలికాన్ ప్యానెల్స్ తయారు చేసే రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తి ప్లాంట్ సింగపూర్‌లో ఉంది.
ఇదీ చదవండి: '2030 నాటికి 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి'