చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ.. నేడు 'రియల్మీ పేసా' (మొబైల్ యాప్) పేరుతో భారత మార్కెట్లో ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టింది. దీని ద్వారా వ్యక్తిగత, వ్యాపార రుణాలు, మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ స్కోర్ నివేదికల వంటి సేవలు అందించనుంది.
చైనాకు చెందిన మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం.. షియోమీ 'ఎంఐ క్రెడిట్' పేరుతో ఆర్థిక సేవలు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే రియల్మీ సేవల్లోకి ప్రవేశించడం గమనార్హం.
రియల్మీ భారత్లోకి ప్రవేశించిన 18 నెలల్లోనే భారీ వృద్ధిని చూశామని 'పేసా' అధిపతి వరుణ్ శ్రీధర్ అన్నారు. పైసా ఆర్థిక సేవలపైనా అంతే నమ్మకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసాకు.. వచ్చే మూడేళ్లలో 25-30 మిలియన్ల మంది వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ తెలిపారు.
రియల్ మీ పేసా లోన్ల వివరాలు..
'రియల్మీ పేసా' బీయా యాప్ ద్వారా వ్యక్తులకు రూ.1 నుంచి రూ.లక్ష వరకూ రుణాలు తీసుకునే అవకాశం కల్పించారు.
చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ.5 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పించనున్నారు.
వెయ్యి కోట్ల రుణాలే లక్ష్యం
మరిన్ని ఆర్థిక సేవలను త్వరలో పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు శ్రీధర్. గూగుల్ ప్లేస్టోర్, రియల్మి యాప్ స్టోర్లలో పేసా యాప్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 6-12 నెలల్లో పేసాను పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2020లో 3-5 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకొని... రూ.1,000 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
వన్ప్లస్ సైతం..
ప్రీమియం స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ అయిన వన్ప్లస్ సైతం తన 'వన్ప్లస్ పే' మొబైల్ చెల్లింపుల వ్యవస్థను తయారుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2020లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.