కరోనా సంక్షోభం నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలోనూ రుణాలపై వడ్డీ వసూలు చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. వడ్డీ వసూలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. రుణాలపై వడ్డీ నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్రం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు సూచించింది. వడ్డీని నిషేధించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)ను కోరింది. తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.
రుణాల తిరిగి చెల్లింపులో వడ్డీ వసూలు చేయకుండా ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ఆదేశించాలని ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తోంది సర్వోన్నత న్యాయస్థానం.