విద్యుత్ వాహనాల డిమాండ్‌ను పెంచే విధంగా ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్ మెటలర్జీ, న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) మరో కీలక విజయం సాధించింది. లిథియం అయాన్ బ్యాటరీల్లో మెటల్ ఆక్సైడ్ ఎలక్ట్రోడ్లపై.. చౌకగా అది కూడా ఒకే దశలో కార్బన్ కోటింగ్‌ను వేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిర్ణయాలకు ఈ పరిశోధన మరింత ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
లిథియం బ్యాటరీ అంటే?
లిథియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) విద్యుత్ సరఫరా కోసం వాడతారు.
లిథియం అయాన్ బ్యాటరీల్లోని క్రియాశీల కాంపోనెంట్స్.. క్యాతోడ్, ఆనోడ్, ఎలక్ట్రోలైట్. కమర్షియల్ గ్రాఫైడ్ను యానోడ్‌గా ఉపయోగిస్తారు. లిథియం మెటల్ ఆక్సైడ్‌ను లేదా లిథియం మెటల్ పాస్పేట్ను క్యాతోడ్గా, లిథియం సాల్ట్‌ను ఎలక్ట్రోలైట్‌గా వాడుతారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలకు విద్యుత్ వాహనాలు పోటీ ఇవ్వాలంటే.. ప్రస్తుతం ఉన్న బ్యాటరీలో సమూల మార్పులు అవసరం. ముఖ్యంగా మైలేజీ, మన్నిక అవసరం.
సామర్థ్యం, మైలేజీ..
లిథియం అయాన్ బ్యాటరీ అనేది.. విద్యుత్ వాహనాల మైలేజీని నిర్ణయిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెంచడంలో ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మైలేజీ పరిమితులు, నగర రోడ్లు, హైవేలపై ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వంటి కారణాలు వినియోగదారులను ఈవీల కొనుగోలు విషయంలో వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
ఇందులో బ్యాటరీల లైఫ్ కూడా మరో ముఖ్యమైన అంశం. బ్యాటరీ సామర్థ్యం 80 శాతానికి తగ్గేముందు.. ఛార్జింగ్ సైకిల్స్ బ్యాటరీ లైఫ్‌ను నిర్ణయిస్తాయి.
ఉదాహరణకు.. బ్యాటరీ సామర్థ్యం తగ్గే ముందు.. 1000 ఛార్జింగ్ సైకిల్స్ సదుపాయం ఉంటే.. దానిని విద్యుత్ వాహనాల్లో వాడేందుకు అనువైన బ్యాటరీగా పరిగణించొచ్చంటున్నారు విశ్లేషకులు.
ఏమిటీ కార్బన్ కోటింగ్..
కార్బన్ కోటింగ్ అనేది.. లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం పెంచేలా యాక్టివ్ మెటీరియల్స్ సైకిల్‌ను మెరుగుపరిచే ప్రక్రియ. ఇందుకే భారత శాశ్త్రవేత్తలు ఈ విధానాన్ని ఉత్తమంగా ఎంపిక చేసుకున్నారు.
కార్బన్ కోటింగ్.. యాక్టివ్ మెటీరియల్స్ జీవిత కాలాన్ని దాదాపు రెట్టింపు చేస్తాయని అంటున్నారు విశ్లేషకులు. అయితే లిథియం మెటల్ ఆక్సైడ్‌ను సింథసిస్ చేసే ప్రక్రియలో కార్బన్ కోటింగ్ వేయడమనేది అంత సులువు కాదని చెబుతున్నారు.
సాధారణంగా ఆక్సైడ్ మెటీరియల్‌పై కార్బన్ కోటింగ్ నేది రెండో దశగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఖరీదైనది కూడా. ఈ కారణంగానే.. ఏఆర్‌సీఐ శాస్త్రవేత్తలు వన్ స్టేప్ కార్బన్ కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనితో బ్యాటరీల ఖర్చులు తగ్గించేందుకు వీలు కలగనుందని చెబుతున్నారు.
విద్యుత్ వాహనాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు..
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిచ్చే విధంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారులకు అందించే సబ్సిడీనీ పెంచింది. ఇందుకోసం ఫేమ్- 2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) పథకంలో కొన్ని సవరణలు చేసింది.
ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు రూ.10వేల చొప్పున ఇస్తున్న సబ్సిడీని రూ.15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకు ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది. దీనితో ఇప్పటికే పరిలు సంస్థలు తమ విద్యుత్ టూవీలర్స్ ధరలు భారీగా తగ్గించాయి. మరిన్ని సంస్థలు అదే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇవీ చదవండి: