కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి అనువైన సమయమని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల(Krishna Ella) పేర్కొన్నారు. ఈ క్రమంలో ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను (నాజల్ వ్యాక్సిన్) బూస్టర్ డోసుగా అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కొవాగ్జిన్‌తో పోలిస్తే దీని ఉత్పత్తి సులభంగా ఉంటుందన్నారు.
నాజల్ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించిన కృష్ణ ఎల్ల.. ప్రపంచ దేశాలు దీనివైపు వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్నారు.
"మేము నాజల్ వ్యాక్సిన్‌తో అభివృద్ధి చేశాం. కొవాగ్జిన్‌ను తొలి డోసుగా ఇచ్చి.. రెండో డోసుకు నాజల్ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. ఇది వ్యూహాత్మకంగా, శాస్త్రీయంగా చాలా ముఖ్యమైనది. నాజల్ను రెండో డోసుగా అందిస్తే.. వైరస్ వ్యాప్తిని ఆపవచ్చు."
- భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల
జికా టీకా సిద్ధం!
మరోవైపు జికా వ్యాక్సిన్ గురించిన మాట్లాడిన ఎల్ల.. ప్రపంచంలోనే తొలిసారిగా జికా వైరస్‌కు భారత్ బయోటెక్.. టీకాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. జికా వ్యాక్సిన్‌తో భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయినట్లు తెలిపిన ఆయన.. ప్రస్తుతం జికా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ట్రయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సూచించారు.
కొవాగ్జిన్‌కు హాంకాంగ్ గుర్తింపు
హాంకాంగ్.. తన దేశం ఆమోదించిన కరోనా టీకా జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చింది. కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపిన వారం రోజులకే హాంకాంగ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
కొవాక్సిన్, కొవిషీల్డ్‌లను ఇప్పటివరకు 96 దేశాలు గుర్తించాయి. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, రష్యా, స్విట్జర్లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ కాల పరిమితి 12 నెలలకు పొడిగింపు