కరోనా సంక్షోభం నేపథ్యంలో పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద జన్‌ధన్ ఖాతాల్లో జమచేసే సొమ్ముపై ప్రజలు వందతులు నమ్మొద్దని కేంద్రం సూచించింది. మహిళల జన్‌ధన్ ఖాతాల్లో ఇప్పటికే ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500లను జమ చేశామని.. మరో రూ.1000 రెండు విడుతల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వం వెనక్కి తీసుకోదు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే అత్యధికంగా జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇటీవలే కేంద్రం జమ చేసిన రూ.500ను త్వరగా తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందనే వదంతులు వ్యాప్తి చెందాయి. దాంతో లాక్డౌన్ ఉన్నా.. బ్యాంకుల వద్ద జనాలు బారులుతీరారు. ఈ నేపథ్యంలో అసత్య వార్తలు నమ్మొద్దని.. ఎవరి ఖాతాలో నుంచి డబ్బును ప్రభుత్వం వెనక్కి తీసుకోదని స్పష్టంచేసింది ఎస్బీఐ. బ్యాంకు ఆ నగదును బ్లాక్ చేయటం, ప్రభుత్వానికి తిరిగి పంపించటం చేయబోదని భరోసా కల్పించింది.
ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు..
ఏప్రిల్ నెలకు సంబంధించిన సొమ్మును ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ట్వీట్ చేసింది. ఆ డబ్బును ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. వదంతులు నమ్మకుండా తమకు అనువైన విధంగా ఏటీఎంలు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, బ్యాంకుల ద్వారా ఉపసంహరించుకోవాలని కోరింది.
20 కోట్ల ఖాతాలు మహిళలవే..
దేశవ్యాప్తంగా పీఎంజేడీవై కింద మొత్తం 38.08 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అందులో 20.60 కోట్ల ఖాతాలు మహిళలవే. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రూ.1.19 లక్షల కోట్లు ఆయా ఖాతాల్లో జమచేసింది కేంద్రం.