సందర్భం ఏదైనా కానీయండి.. బంగారాన్ని కొనడానికి అందరూ ఇష్టపడుతుంటారు. అయితే, పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు మాత్రం నేరుగా బంగారం కొనడం కన్నా.. పరోక్షంగా అందులో మదుపు చేయడమే కలిసొస్తుంది. ఇటీవల కాలంలో బంగారం ధర పెరగుతూ ఉండటం.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇందులో చిన్న మొత్తాలతోనూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి గోల్డ్ ఈటీఎఫ్ (గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్)లు(GOLD ETF) ఒక ప్రత్యామ్నాయంగా మారింది.
దేశీయ బంగారం ధరలకు(Gold rates today) దగ్గరగా ఉంటూ.. ఒక్క గ్రాము పెట్టుబడికీ అవకాశం కల్పించేవి గోల్డ్ ఈటీఎఫ్‌లు(gold etf price today). వీటిలో మదుపు చేయడం అంటే.. బంగారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కొనడం అన్నమాట. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు.. వీటిని యూనిట్ల రూపంలో కొనొచ్చు. కావాలనుకున్నప్పుడు అమ్మొచ్చు. అంటే, పసిడిలో సులభంగా లావాదేవీలు నిర్వహించేందుకు ఇవి ఒక సులభమైన మార్గంగానూ అనుకోవచ్చు.
బంగారానికి సమానంగానే..
గోల్డ్ ఈటీఎఫ్(GOLD ETF) ఒక యూనిట్ కొన్నారంటే.. మదుపరులు 99.5శాతం శుద్ధతతో బంగారాన్ని కొన్నట్లే లెక్క. ఒక యూనిట్ ఒక గ్రాముతో సమానంగా ఉంటుంది. బంగారం రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులు గోల్డ్ ఈటీఎఫ్‌లపైనా ప్రభావం చూపిస్తాయి. బంగారం 10 శాతం పెరిగితే.. గోల్డ్ ఈటీఎఫ్ సైతం 10శాతం లాభాన్ని అందిస్తుంది.
తక్కువ ఖర్చుతో..
బంగారాన్ని నేరుగా కొన్నప్పుడు కొన్ని ఖర్చులు కలిసి ఉంటాయి. దీంతో మార్కెట్ ధరకన్నా ఎక్కువ పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే అమ్మేటప్పుడు ఈ ఖర్చులన్నీ తిరిగి రావు. ఈ ఇబ్బంది ఈటీఎఫ్‌లతో ఉండదు(gold etf price today). మార్కెట్ రేటును బట్టి, వీటిని కొనొచ్చు, అమ్మొచ్చు. బంగారాన్ని భద్రపర్చడమూ కష్టమే. ఫండ్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి, రక్షణకు ఇబ్బందేమీ ఉండదు.
రూ.50తోనూ..
సాధారణంగా బంగారాన్ని కొనాలంటే.. రూ.వేలల్లోనే అవసరం. కానీ, కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.50తోనూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా దీర్ఘకాలం మదుపు చేస్తూ.. మదుపరులు బంగారాన్ని కూడబెట్టుకోవచ్చు. నేరుగా బంగారం కొన్నప్పుడు ఈ వెసులుబాటు ఉండదు.
సులభంగా..
సౌలభ్యం.. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఉన్న ప్రధాన వెసులుబాటు ఇదే. ఆన్‌లైన్‌లో డీమ్యాట్ ఖాతా నుంచి కొనడం, అలాగే అమ్మడం చేసుకునే వీలుంది. కాబట్టి, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే పసిడిలో లావాదేవీలు చేసుకోవచ్చు.
పన్ను భారం లేకుండా..
బంగారాన్ని నేరుగా కొన్నప్పుడు 3 శాతం వరకూ జీఎస్‌టీ చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లో దీర్ఘకాలిక మూలధన లాభం వర్తిస్తుంది. దీన్నీ ద్రవ్యోల్బణ సూచీతో సర్దుబాటు చేస్తారు.36 నెలల తర్వాత యూనిట్లను అమ్మినప్పుడు వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు.
పండగల వేళ అనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేందుకు బంగారం ఈటీఎఫ్‌లు కొంత తోడ్పడతాయి. పెట్టుబడిలో 10శాతాన్ని బంగారానికి కేటాయించడం ద్వారా వైవిధ్యాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది.
- నితిన్ కబాది, హెడ్-ఈటీఎఫ్ బిజినెస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ