ETV Bharat / business

భారత విదేశీ వాణిజ్యంలో గణనీయ మార్పు.. సరళీకరణ ఫలితమే! - భారత విదేశీ దిగుమతులు

వాణిజ్యమే అభివృద్ధికి ఊపిరి అనేది ఆర్థికవేత్తల సూత్రీకరణ. అయితే.. విదేశీ వాణిజ్యంపై ఆధారపడకుండా పూర్తిగా స్వావలంబన సాధనకే అంకితమైన భారత్‌.. ఆ వ్యూహం ఫలించక ఆర్థిక సరళీకరణను చేపట్టింది. 1992 నుంచి ఊపందుకొన్న ఈ సరళీకరణలతో విదేశీ వాణిజ్యంలో గణనీయ మార్పు వస్తోంది.

editorial
వాణిజ్యం
author img

By

Published : Dec 19, 2021, 7:18 AM IST

గడచిన ఏడు దశాబ్దాల్లో వర్ధమాన దేశాలన్నింటిలోకీ భారతదేశ అభివృద్ధి రథం పూర్తి భిన్నమైన బాటలో పయనించింది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల మాదిరిగా ఆరు నుంచి పది శాతం అద్భుత వృద్ధిరేట్లను భారత్‌ అందుకోలేదు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల తరహాలో తరచూ దీర్ఘకాల ఆర్థిక స్తంభననూ ఎదుర్కోలేదు. చైనా, ఇతర తూర్పు ఆసియా దేశాల మాదిరిగా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగానికి, అక్కడి నుంచి సేవారంగానికి మన వృద్ధి రథం పరుగు తీయలేదు. స్వాతంత్య్రం వచ్చాక తొలి మూడు దశాబ్దాల్లో (1950-80) 3.5శాతం వృద్ధిరేటుతో సరిపెట్టుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించేవారు. తదుపరి రెండు దశాబ్దాల్లో ఏటా అయిదు నుంచి ఆరుశాతం వృద్ధి రేటు సాధించగలిగాం. ఆపైన రెండు దశాబ్దాల్లో భారత్‌ వరసగా ఏడు శాతం, అయిదు శాతం పైచిలుకు వృద్ధిరేట్లు నమోదు చేసింది. వాణిజ్యమే అభివృద్ధికి ఊపిరి అనేది ఆర్థికవేత్తల సూత్రీకరణ. 1950-75 మధ్య మన దిగుమతులపై కఠినమైన నియంత్రణలు ఉండేవి, విదేశీ వాణిజ్యంపై ఆధారపడకుండా పూర్తిగా స్వావలంబన సాధనకే భారత్‌ అంకితమైంది. ఆ వ్యూహం ఫలించకపోవడంతో 1976-91 మధ్య కొంత ఆర్థిక సరళీకరణను చేపట్టక తప్పలేదు. 1992 నుంచి ఆర్థిక సరళీకరణ ఊపందుకొంది.

సంస్కరణల ప్రభావం..

స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మన దగ్గరున్న కొద్దిమాత్రం విదేశ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా హరించుకుపోకుండా చూసుకోవడానికి దిగుమతులపై కఠినమైన నియంత్రణలు విధించక తప్పలేదు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైనప్పటి నుంచి క్రమంగా నియంత్రణల తీవ్రత తగ్గిస్తూ సరళీకరణకు ప్రాధాన్యమిచ్చారు. 1956-57లో విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించారు. విదేశీ దిగుమతుల పోటీ నుంచి భారతీయ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.

దిగజారిన పరిస్థితి..

1966 జూన్‌లో భారత ప్రభుత్వం డాలరుతో రూపాయి మారక విలువను తగ్గించింది. దీనికితోడు దిగుమతులపై ఆంక్షలనూ సడలించి, సుంకాలు తగ్గించి, ఎగుమతి సబ్సిడీలను పెంచింది. ఆనాడు సంఘటిత రంగ పారిశ్రామికోత్పత్తిలో 80 శాతానికి మూలమైన 59 పరిశ్రమలకు ముడి సరకులు, విడి భాగాలను దిగుమతి చేసుకునే స్వేచ్ఛనిచ్చింది. అలా దిగుమతి చేసుకునే ముందు స్వదేశంలో ఆ సరకులు, విడిభాగాలు లభ్యం కావడం లేదని నిర్ధరిస్తేనే లైసెన్సు మంజూరు చేసేవారు. దీంతో సరళీకరణ ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. సరళీకరణ వల్ల పెరిగే దిగుమతుల బిల్లు చెల్లించడానికి వీలుగా భారత్‌కు కొన్ని సంవత్సరాలపాటు ఆర్థిక సహాయం చేస్తానని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. కానీ, ఆ సమయంలో వరసగా రెండుసార్లు పంటలు విఫలమై పారిశ్రామిక మాంద్యం ఏర్పడటంతో భారత్‌ 1966-67లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేక పోయింది. దీనికితోడు 1960వ దశకం చివర్లో, 1970వ దశకం మొదట్లో భారత్‌ ఆర్థిక పరిస్థితి జటిలం కావడంతో మళ్ళీ దిగుమతులపై నియంత్రణలు విధించాల్సి వచ్చింది.

editorial
.

సులభ షరతులపై..

స్వేచ్ఛాయుత సాధారణ లైసెన్సింగ్‌ (ఓజీఎల్‌) విధానాన్ని 1976లో తిరిగి ప్రవేశపెట్టడంతో కొత్త దశ సరళీకరణ మొదలైంది. ఓజీఎల్‌ జాబితాలోని వస్తువుల దిగుమతులకు కేంద్ర వాణిజ్యశాఖ అనుమతి తీసుకోనక్కర్లేదు. 1976లో ఈ జాబితాలో పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, సంబంధిత వస్తువులు 79 వరకు ఉండగా, 1988 ఏప్రిల్‌ నాటికి అవి 1,170కి పెరిగాయి. అంతిమ ఉత్పత్తి వినియోగదారుడికి చేరేలోపు, దాని తయారీకి అవసరమైన 949 మధ్యంతర వస్తువులనూ ఈ జాబితాలో చేర్చారు. 1990 నాటికి మొత్తం దిగుమతుల్లో 30శాతం ఓజీఎల్‌ దిగుమతులే. దీనికితోడు పరిశ్రమలకు సులభ షరతులపై రుణాలనూ విస్తరించారు.

సంస్కరణల పథం..

ఫలితంగా భారతదేశం 1950-80నాటి 3.5శాతంగా ఉండే వృద్ధి రేటును వదిలించుకుని 1981-91 మధ్యకాలంలో సగటున ఏటా 5.6శాతం వృద్ధి రేటును అందుకోగలిగింది. అయితే, ఈ అభివృద్ధి ప్రధానంగా రుణాలపై ఆధారపడినది కావడంతో 1991లో భారత్‌ తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కోవలసి వచ్చింది. విదేశాలకు చెల్లింపులు జరపలేకపోయింది. దీంతో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టి మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ద్వారాలు తెరచింది. రూపాయి విలువను 22శాతం తగ్గించింది. ఎగుమతిదారులు తాము ఆర్జించే విదేశీ ద్రవ్యంలో 60శాతాన్ని మార్కెట్‌ రేటుకు అమ్ముకోవచ్చని, మిగతాది ప్రభుత్వానికి అధికారిక ధరపై విక్రయించాలని 1992 ఫిబ్రవరిలో ఆదేశించారు. తరవాత ఏడాది గడిచేసరికి మార్కెట్‌ ధర, అధికార ధర సమమయ్యాయి. బ్యాంకింగ్‌, బీమా, టెలి కమ్యూనికేషన్లలో ప్రభుత్వ రంగ ఆధిపత్యం కొనసాగుతున్నా- ప్రైవేటు రంగానికి, విదేశీ సంస్థలకు కూడా క్రమక్రమంగా ప్రవేశం కల్పించసాగారు.

పోటీ వాతావరణం అవసరం..

భారత్‌ నేడు ప్రపంచానికి ఔషధ సరఫరాదారుగా ఎదిగింది. ఐటీ రంగంలో పొరుగు సేవలకు ప్రధాన కేంద్రంగా అవతరించింది. 2019 నాటికి భారత్‌ విదేశీ రుణభారంకన్నా విదేశ మారక ద్రవ్య నిల్వలు అధికంగా నమోదయ్యాయి. ఇలాంటి కారణాల ఫలితంగా కొవిడ్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక ఆటుపోట్లను అధిగమించగల స్థితిలో ప్రస్తుతం భారత్‌ నిలుస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశాలతో సాంకేతిక సహకార ఒప్పందాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో నియంత్రణలను సడలిస్తే ఎఫ్‌డీఐలు మరింత పెరుగుతాయి.

భారతదేశ విదేశీ వాణిజ్యం ఇంతవరకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పరిధికి లోబడింది. దానివల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. 2001 నుంచి బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాలూ మందగించాయి. వాణిజ్య వివాద పరిష్కార యంత్రాంగం బలహీనంగా ఉంది. సుంకాల పెంపునకు దేశాల మధ్య పోటీ విస్తరిస్తోంది. 90శాతం భారతీయులు ఇప్పటికీ చిన్న కమతాల సేద్యంపై, అసంఘటిత రంగ ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి, విదేశీ వాణిజ్యం వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపలేకపోతోంది. మన పేదరిక స్థాయినీ తగ్గించలేకపోతోంది. భారత్‌లో సుంకాల రేట్లు ఎక్కువగా ఉండటం ఎఫ్‌డీఐల ప్రవాహానికి ఆటంకంగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. ఇతర దేశాలకు దీటుగా పోటీపడి ప్రపంచ మార్కెట్‌లో పెద్ద వాటాను సంపాదించడానికి తగిన విధానాలను చేపట్టాలి.

ఎగుమతుల్లో పురోగతి..

భారత్‌లో ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహక విధానాలు చేపట్టింది. 2014 తరవాత ఎగుమతుల వృద్ధికి ‘మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, ‘నైపుణ్య వృద్ధి’ పథకాలు తోడ్పడ్డాయి. సుమారు 380 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఇండియాను రూపాంతరం చెందించడానికి తోడ్పడే కొత్త వాణిజ్య విధానాన్ని 2022 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి జిల్లాలో ఎగుమతుల వృద్ధి కేంద్రాలను నెలకొల్పడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. 1990-91 నుంచి మన విదేశీ వాణిజ్య తీరుతెన్నులు సమూలంగా మారిపోయాయి. స్వాతంత్య్రం వచ్చాక అనేక దశాబ్దాలపాటు 60శాతం ఎగుమతులు- తేయాకు, జౌళి, జనుము, ఖనిజాలు తదితర ముడిసరకులుగానే ఉండేవి. 2000 సంవత్సరం నుంచి యంత్రాలు, ఇంజినీరింగ్‌ వస్తువులను సైతం ఎగుమతి చేయగలుగుతున్నాం. ఇప్పుడు ముడి సరకుల ఎగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. దిగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులే సింహభాగం ఆక్రమిస్తున్నాయి. ఉత్పత్తికి కీలకమైన భారీ యంత్రాల దిగుమతులూ పెరుగుతున్నాయి.

-రచయిత్రి- డాక్టర్ రఘురామపాత్రుని, అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.