మనలో చాలామంది ఆహార పదార్థాలు కొనేందుకు సూపర్ మార్కెట్‌కు వెళ్తుంటాం. అవసరమున్న వాటిని తీసుకునేటప్పుడు వాటి ధర పక్కాగా గమనిస్తాం. కానీ వాటిపై ఉండే తేదీల విషయాన్ని మాత్రం కొన్నిసార్లు పట్టించుకోం. తీరా వాటిని తిన్న తర్వాత లేనిపోని అనారోగ్యం తెచ్చుకుంటాం.
అందుకే.. ప్యాకేజీలపై ఉండే మాన్యుఫ్యాక్చరీంగ్ డేట్(తయారీ తేదీ), ఎక్స్పైరీ డేట్ వంటివి తప్పక చూసి కొనుగోలు చేయాలి. అలా చూసేటప్పుడు ఎక్స్పైరీ డేట్.. బెస్ట్ బిఫోర్ డేట్ ఒకటే అనుకుంటాం. కానీ ఈ రెండింటికీ వేరువేరు తేదీలు ఉంటాయి. వీటి మధ్య వ్యత్యాసాన్ని మీరూ తెలుసుకోండి.
బెస్ట్ బిఫోర్ డేట్
ఏదైనా ఆహార పదార్థంపై బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటే.. ఆ తేదీ తర్వాత ఆహారం మంచిది కాదని అర్థం. కానీ దానిని తినకూడదు అని ఏంలేదు. సరిగ్గా భద్రపరిచినట్లైతే.. ఆ తేదీ దాటిన తర్వాత కూడా ఆ ఫుడ్‌ను తినొచ్చు. కానీ నాణ్యత మాత్రం దెబ్బతింటుంది. అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి.
ఎక్స్పైరీ డేట్
ఎక్స్పైరీ డేట్ విషయానికొస్తే.. ఆ ఆహార పదార్థం ఆ తేదీలోపు మాత్రమే తినాలి. ఒకవేళ ఆ నిర్దిష్ట తేదీ అయిపోయిన తర్వాత దాన్ని తినట్లయితే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో ఉండే పోషకాలు ఏ మాత్రం పనికిరావు. అందుకే ఏదైనా కొనేముందు.. దాని ఎక్స్పైరీ డేట్ పక్కగా చూడాలి.
ఎక్స్పైరీ డేట్ వేటి మీద ఉంటుంది?
సాధారణంగా.. ఐదు రకాల వస్తువులపై తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.
- చిన్నపిల్లలు తీసుకునే పాలు
- పోషకాలను అందించే పదార్థాలు
- ఆహార పదార్థాలు
- లో ఎనర్జీ డైట్స్
- లిక్విడ్ డైట్స్
పడేయాల్సిందే..
ఒక్కోసారి కొన్ని ఆహార పదార్థాల నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది. బెస్ట్ బిఫోర్ డేట్, ఎక్స్పైరీ డేట్లు చాలా దూరంగా ఉన్నప్పటికీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏ మాత్రం అనుమానం వచ్చిన వాటిని తినకుండా పడేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: