స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే బీఎస్ఈ మదుపరుల సంపద రూ.31 లక్షల కోట్లకుపైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా విజృంభణ, కఠిన ఆంక్షలు.. ఇవేవి స్టాక్ మార్కెట్ల జోరును అడ్డుకోలేకపోయాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ స్థాయి వృద్ధితో.. జులై 30 నాటికి బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) రూ.2,35,49,748.90 కోట్లకు చేరింది.
2021 ఏప్రిల్-జులై మధ్య నాలుగు నెలల కాలంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 3,077 పాయింట్లు (6.21 శాతం) పుంజుకుంది. జులై 16న ఈ సూచీ ఏకంగా 53,290.81 పాయింట్ల వద్ద (ఇంట్రాడేలో) జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. జులై 15న తొలిసారి 53,158.85 పాయింట్ల వద్ద ముగిసింది.
2020-21లో ఇలా..
గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద.. సెన్సెక్స్ 20,040.66 పాయింట్లు (68 శాతం) బలపడింది. దీనితో బీఎస్ఈ నమోదిత కంపెనీల విలువ రూ.90,82,057.95 కోట్ల నుంచి రూ.2,04,30,814.54 కోట్లకు పెరిగింది.
ఈ స్థాయి వృద్ధికి కారణాలు..
ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల స్టాక్ మార్కెట్లు మినహా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుండటం సానుకూల అంశమని అంటున్నారు నిపుణులు. అమెరికా ఫెడ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన కేంద్రీయ బ్యాంక్లు వడ్డీ రేట్లను చారిత్రక కనిష్ఠానికి తగ్గించడం, రిటైల్ మదుపరులు రికార్డు స్థాయిలో పెరగటం వంటివి ఈ స్థాయిలో మార్కెట్లు దూసుకుపోయేందుకు కారణం అని చెబుతున్నారు.
కరోనా వల్ల గత ఏడాది చారిత్రక పతనాన్ని చవిచూసినా.. వ్యాక్సిన్ వార్తల వల్ల సెంటిమెంట్ బలపడిందని అందువల్లే మార్కెట్లు దూసుకుపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: