ఆరోగ్య బీమా ఎంత అవసరమో కొవిడ్ మహమ్మారి తెలియజెప్పింది. ఆరోగ్య బీమా లేనివారు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స కోసం పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఆర్థికంగా చితికిపోయిన వారూ ఉన్నారు. అప్పటి వరకు ఆరోగ్య బీమా లేనివారు కూడా కొవిడ్ పుణ్యమా అని బీమా తీసుకునేందుకు ముందుకు రావడం ఇటీవల ఎక్కువైంది. అయితే, ఇప్పటికీ ఆరోగ్య బీమా విషయంలో కొన్ని అపోహలు మాత్రం అలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అపోహ 1: చిన్న వయసులో బీమా అవసరం లేదు
చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చెబుతుంటారు. కానీ అలా తీసుకోవడం చాలా మంచిది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. ముందస్తు వ్యాధులు ఉండి ఆరోగ్య బీమా తీసుకున్నట్లయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. ప్రమాదాలు, వ్యాధులు ఆకస్మికంగా సంభవిస్తున్నాయి కాబట్టి వీలైనంత చిన్న వయస్సులో ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా ఈ వెయిటింగ్ పీరియడ్ సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్య బీమా ప్రీమియం వయసుతో పాటు పెరుగుతుంది. కాబట్టి చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.
అపోహ 2: మొదటి రోజు నుంచే ఆసుపత్రి ఖర్చులను కంపెనీలు భరిస్తాయి
ప్రమాదాలు మినహా అన్ని బీమా పాలసీల్లో 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వెంటనే బీమా కంపెనీ నుంచి సహాయం అందుతుందని ఊహించకండి. పాలసీలోని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. దీనివల్ల బీమా క్లెయిం చేసుకునేటప్పడు మీకు నిరాశ ఎదురుకాదు.
అపోహ 3: క్లెయిం చేసుకోవడం కోసం కచ్చితంగా 24 గంటలుండాలి
వైద్య శాస్త్రంలో ఆధునికత పెరిగిన ఈ రోజుల్లో చాలా వ్యాధులకు చికిత్స కేవలం కొన్ని గంటల్లోనే జరుగుతోంది. కంటి శస్త్ర చికిత్స, లిథోగ్రఫీ, డయాలిసిస్, కీమోథెరపీలకు ఒక్క రోజులోనే చికిత్స అయిపోతోంది. కాబట్టి కొన్ని గంటల వ్యవధిలో పూర్తయిన చికిత్సలకు కూడా బీమా కంపెనీలు క్లెయింలను పరిష్కరిస్తున్నాయి. ఇంకా కొన్ని బీమా కంపెనీలు దంతాల చికిత్స లాంటి ఔట్ పేషేంట్ సేవలకు కూడా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే వీటి ప్రీమియం కాస్త అధికంగా ఉండొచ్చు.
అపోహ 4: నెట్‌వర్క్ ఆసుపత్రులలో మాత్రమే బీమా సౌకర్యం పొందొచ్చు
బీమా కంపెనీ తెలిపిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందే సౌకర్యం ఉంటుంది. అయితే నాన్ - నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొంది చెల్లించిన సొమ్మును బీమా కంపెనీ నుంచి తిరిగి పొందొచ్చు. అలాగే క్లెయిమ్ పరంగా కూడా నెట్‌వర్క్, నాన్- నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
ఇదీ చదవండి:వయసుకు తగ్గ ఆరోగ్య బీమా ఎంపిక ఎలా?