దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో 5జీ సేవల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర సమాచార, ఐటీ, రైల్వేశాఖల మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. '5జీ స్పెక్ర్టం విషయంలో ప్రస్తుతం ట్రాయ్ సమగ్ర కసరత్తు చేస్తోంది. వారు సిఫార్సులు పంపిన తర్వాత.. మేం వేలంపాటను ప్రారంభించగలం' అని మంత్రి తెలిపారు. ట్రాయ్ తన సిఫార్సులను టెలికమ్యూనికేషన్స్ విభాగాని(డీవోటీ)కి ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభంలో పంపగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
టెలికాం రంగంలో లాభాలను పునరుద్ధరించే దిశగా కేంద్రం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ రంగంలో ఆయా సమస్యలకు సంక్లిష్టమైన నియంత్రణ వ్యవస్థే మూలకారణమన్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థను సరళీకృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టెలికాం రంగంలో ప్రవేశపెడుతున్న సంస్కరణలు, ఇతర కార్యక్రమాల పూర్తి ఫలితాలు రాబోయే రెండు మూడేళ్లలో కనిపిస్తాయని తెలిపారు. మరోవైపు ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పటికే 5జీ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: