కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని, ఆత్మ నిర్భర భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి తొలి దశ విధివిధానాలను ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ. లాక్డౌన్తో స్తంభించిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో 15 సూత్రాల ప్రణాళిక ఆవిష్కరించింది. ఈ వివరాల్ని దిల్లీలో వెల్లడించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.
అత్యధికంగా 6 ఉద్దీపన చర్యల్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసమే ప్రకటించింది మోదీ సర్కార్. లాక్డౌన్తో మూతపడ్డ పరిశ్రమల్ని తిరిగి తెరిచి... పేదలు, మధ్య తరగతి ప్రజల జీవనోపాధిని కాపాడేలా భారీ స్థాయిలో సులువుగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, డిస్కంలు, కాంట్రాక్టర్లకు నగదు లభ్యత పెంచేలా చర్యలు చేపట్టింది. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గింపు, టీడీఎస్ తగ్గింపు వంటి నిర్ణయాలతో వేతన జీవులకు ఊరట కల్పించే ప్రయత్నం చేసింది.
ఎమ్ఎస్ఎంఈల కోసం..
- వ్యాపార అవసరాలకు రూ.3 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు. రుణాల చెల్లింపుపై 12 నెలల మారటోరియం.
- సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.20 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణ సౌకర్యం
- ఫండ్ ఆఫ్ ఫండ్ పేరిట 50 వేల కోట్లను ఎమ్ఎస్ఎంఈలకు అందజేసే లక్ష్యం
- ఎమ్ఎస్ఎంఈల నిర్వచనం మార్పు
- రూ.200 కోట్ల కన్నా తక్కువ విలువ చేసే ప్రాజెక్టులకు విదేశీ టెండర్లు రద్దు
- ఎమ్ఎస్ఎంఈలకు మరిన్ని సదుపాయాలు
ఉద్యోగుల కోసం...
- వ్యాపార సంస్థలు, ఉద్యోగులకు మూడు నెలలు ఈపీఎఫ్ మద్దతు. ఇందుకు రూ.2500 కోట్లు కేటాయింపు.
- ఉద్యోగులు, యాజమాన్యాల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుంచి 10 శాతానికి తగ్గింపు. మూడు నెలలకు వర్తింపు- రూ.6750 కోట్లు కేటాయింపు.
ద్రవ్య లభ్యత పెంపు కోసం...
- బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీ), హెచ్సీ, ఎమ్ఎఫ్ఐలకు రూ.30వేల కోట్ల ద్రవ్య లభ్యత
- ఎన్బీఎఫ్సీలకు రూ.45 వేల కోట్లతో 'క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0'
- డిస్కంలలో 90వేల కోట్ల లిక్విడిటీని చొప్పించేందుకు చర్యలు
- కాంట్రాక్టర్లకు ఉపశమన చర్యలు
- రిజిస్ట్రేషన్లు పొడిగింపు, రెరా కింద చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తిచేసే గడువును పెంపు.
వేతన జీవుల కోసం...
- టీడీఎస్/టీసీఎస్ తగ్గింపు- రూ.50వేల కోట్ల ద్రవ్య లభ్యత పెరుగుదల
- ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కొన్ని మినహాయింపులు