విజయవాడ సమీపం గన్నవరంలోని విమానాశ్రయ విస్తరణ, కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం, సదుపాయాల ఏర్పాటునకు చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన చేయగా.... నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీనికోసం గన్నవరం విమానాశ్రయం ప్రాంగణంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకరన్, కాలుష్య నియంత్రణ మండలి, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయ పరిసర గ్రామాల్లోని ప్రజలు హాజరై పర్యావరణానికి సంబంధించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాలుష్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలు నమోదు చేస్తోన్న అధికారులు ప్రజాభిప్రాయాన్ని వీడియో రూపంలో నమోదు చేశారు. విమానాశ్రయ టర్మినల్ నమూనాతో కలిపి వీటిని కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వశాఖకు పంపనున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ విమానాశ్రయ టర్మినల్ నిర్మాణానికై పర్యావరణ అనుమతులు జారీ చేసే అవకాశాలున్నాయి. రెండు నెలలల్లో అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని.. రాగానే నూతన టర్మినల్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచి నిర్మాణం ప్రారంభిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానాశ్రయ విస్తరణను స్వాగతించిన స్థానిక ప్రజలు.. విమానాశ్రయం కోసం భూములిచ్చిన తమకు సత్వరమే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరగా... ఈ మేరకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ :