పుల్వామా ఉగ్రదాడితో చెలరేగిన నిరసనలు హింసాయుతం అయ్యే అవకాశం ఉన్నందున జమ్మూ నగరంలో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. శాంతి భద్రతలు అదుపులో ఉంచడానికి ప్రజలు సహకరించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది.
" ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జమ్మూలో కర్ఫ్యూ విధించాం." - రమేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్, జమ్మూ.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు
పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. జువెల్ చౌక్, పురాని మండి, రెహరి, శక్తినగర్, పక్క డంగా, జనిపుర్, గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు రాళ్లు విసరటం వల్ల గుజ్జార్ ప్రాంతంలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్, తీవ్రవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్లపై టైర్లను కాల్చారు నిరసనకారులు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
కాన్వాయ్‌ల రాకపోకలు బంద్
పుల్వామా ఉగ్రదాడితో కశ్మీర్ లోయలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రక్షణ దళాల వాహనశ్రేణి రాకపోకలను నిలిపివేశారు అధికారులు.