ఎన్నికల సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఎలాంటి వివరణ తీసుకోకుండా ఐపీఎస్‌లను బదిలీ చేయడాన్ని తప్పుపెట్టారు.రాష్ట్రంపై రోజురోజుకూ కుట్రలు పెరిగిపోతున్నాయని...ఎవరెన్ని కుట్రలు పన్నినాతగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు తెదేపా పక్షాన ఉన్నంత వరకు ఎవరి కుట్రలూ సాగవని అన్నారు. జగన్ కోరినందునే మోదీ -షా...ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారిని బదిలీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఏ కారణంతో ఈ బదిలీ చేశారని ప్రశ్నించారు.
కనిగిరి అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై దాడులు కక్ష సాధింపులో భాగమేనన్నారు. ఇంకా ఎన్నో కుట్రల చేసేందుకు మోదీ, జగన్, కేసీఆర్ సిద్ధపడ్డారని వ్యాఖ్యానించారు. దేనినైనా ఎదుర్కొనేలా తెగించి ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.బాబాయి చనిపోతే సాక్ష్యాలన్నీ మాయం చేసి సీబీఐ విచారణ కోరిన జగన్... తానుచేసిన తప్పులు బయటపడతాయనే కడప ఎస్పీని బదిలీ చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.
పోలవరం ఆపాలని మళ్లీ సుప్రీం కోర్టును తెలంగాణ ఆశ్రయించటం నీచమైన చర్యగా అభివర్ణించిన సీఎం... అతి విశ్వాసంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.