భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక గణాంకాల్లో అవకతవకలకు పాల్పడుతూ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. అసోం గువహటిలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన...ఇటీవల జాతీయ గణాంక సంస్థ సభ్యుల రాజీనామాను ఉటంకించారు.
గత సంవత్సరం భాజపాకు రాజీనామా చేసిన ఈయన... గణాంకాల అవకతవకలకు పాల్పడుతోన్న మొదటి ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు.
" దేశం 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందటం లేదు. ఎన్డీఏ అభివృద్ధిని ఎక్కువ చేసి చూపెడుతోంది. అదే సమయంలో యూపీఏ హయంలో వృద్ధి తక్కువగా చూపెడుతోంది. నోట్ల రద్దు సంవత్సరం(2016)లో వృద్ధి రేటును 8.2 శాతంగా సవరించారు. ఇది అవాస్తవం. " - యశ్వంత్ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి
ప్రస్తుత ప్రభుత్వంలో మీడియా అత్యంత ప్రతికూలంగా ప్రభావితమైందని సిన్హా అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మోదీ ఆ శాఖల మంత్రులను సంప్రదించరని విమర్శించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై..
ఈశాన్య రాష్ట్రాల అతిపెద్ద ఆందోళన ఈ పౌరసత్వ సవరణ బిల్లేనని, ఇది రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం లేదని అన్నారు. లోక్సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు అన్ని కోణాల్లో తప్పేనని, ప్రభుత్వం ఎగువసభలో ప్రవేశపెట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
" ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఉనికికి సంబంధించిన సమస్య ఇది. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు. బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." - యశ్వంత్ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి